calender_icon.png 17 July, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణం తీసిన ఈత సరదా

19-06-2025 12:00:00 AM

చెరువులో మునిగి బాలిక మృతి 

మహబూబాబాద్, జూన్ 18 (విజయ క్రాంతి): సరదాగా చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి బాలిక దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్ల గూడెంలో బుధవారం జరిగింది. కాటినగరం గ్రామానికి చెందిన యశోద నరేష్ దంపతుల కుమార్తె శ్రావణి స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న కోమట్ల గూడెం చెరువులోకి ఈతకు వెళ్ళింది. ఈ క్రమంలో ఆమె స్నేహితులను తల్లి ఈతకు వద్దని వారించడంతో ఇంటికి తిరుగు ముఖం పట్టారు.

శ్రావణి మాత్రమే చెరువులో ఈత కొడుతుండగా లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లడంతో అందులో మునిగి చేతులు పైకి ఎత్తడంతో దారిలో వెళ్తున్న వారు గమనించి రక్షించడానికి ప్రయత్నించగా సాధ్యపడకపోవడంతో గ్రామంలోకి వెళ్లి మరికొంతమందిని తీసుకువచ్చి లోతుగా ఉన్న చెరువులోకి దిగి శ్రావణిని బయటికి తీసి నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. శ్రావణి గంగారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోందని, త్వరలో హాస్టల్ కు వెళ్లేదని, ఇంతలోనే చెరువులో మునిగి చనిపోవడంతో విషాదం అలుముకుంది. 

మరణంతో విడిపోయిన కవలలు!

యశోద నరేష్ దంపతులకు శ్రవణ్, శ్రావణి కవల పిల్లలుగా జన్మించారు. పిల్లలు ఇద్దరిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ, శ్రావణ్, శ్రావణి పేర్లు పెట్టుకున్నారు.  శ్రావణి నీట మునిగి చనిపోవడంతో మృత్యువు కవలలను విడదీసిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.