26 March, 2026 | 2:49 AM

దాబాల్లో మద్యం దందా!

26-03-2026 12:31 AM
  1. పేరుకే ‘ఫ్యామిలీ’.. లోపలంతా బార్ల తీరే...
  2. బార్లను తలపిస్తున్న సిట్టింగులు
  3. అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా లిక్కర్ అమ్మకాలు
  4. అడపాదడపగా పోలీసులు, ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
  5. ఎస్పీ ఆదేశాలున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యం

మెదక్, మార్చి 25 (విజయ క్రాంతి) :అవన్నీ పేరుకే ఫ్యామిలీ దాబాలు.. లోపలంతా బార్ల మాదిరిగానే మద్యం సరఫరా జరుగుతోంది. అనేక దాబాల్లో అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం నామమా త్రపు తనిఖీలతో సరిపుచ్చుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలోనీ జాతీయ రహదారిపైన ఉన్న కాళ్లకల్, మనోహర్ బాద్, తూప్రాన్, చేగుంట, రామా యం పేట, నర్సాపూర్, కౌడిపల్లి ప్రాంతాల్లో నీ దాబాల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. కేవలం ఆహారపదార్థాలు మాత్రమే అందించాల్సిన దాబాల్లో అర్ధరా త్రి వరకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నా రు.

ఒకవైపు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు దాబాల్లో మద్యం అమ్మకాలు చేయవద్దని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని అధి కారులను ఆదేశిస్తున్నా పోలీసులు మాత్రం నామమాత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు కూడా హైవేల పక్కనున్న దాబాల్లో నామమాత్రం గా తనిఖీలు చేసి వెళుతున్నారు. వారు వెళ్లిన వెంటనే దాబాల యజమానులు యథామామూలుగా మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కొన్ని దాబాల్లో మద్యం సరఫరాకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి విక్రయాలు జరుపుతున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. 

 అధిక ధరకు సరఫరా.. 

కొన్ని దాబాల్లో మద్యం తాగేందుకు వచ్చినవారికి మద్యం బయటనుంచి తీసుకురావాలని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దాంతో వారు దాబాలకు వస్తూనే మద్యం వెంట తెచ్చుకొని అర్ధరాత్రి వరకు తాగుతున్నారు. ఎవరైనా మద్యం తెచ్చుకోకుండా దాబాకు వెళితే సిబ్బంది ప్రత్యేకంగా రేటు నిర్ణయించి మద్యం సరఫరా చేస్తున్నారు. చాలా దాబాలు పేరుకు ఫ్యామిలీ దాబాలని బయట బోర్డులు పెట్టి లోపల మాత్రం అనధికారిక బార్లను నిర్వహిస్తున్నారు.

కొన్ని దాబాల్లో క్వార్టర్ బాటిల్కు రూ.100నుంచి రూ.200వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ వైన్ షాపులు, బార్లు మూసే స్తుండడంతో మందుబాబుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొన్ని దాబాల యజమానులు సొమ్ము గుంజుతున్నారే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. 

 అర్ధరాత్రి వరకు మందుబాబుల ఆగడాలు.. 

దాబాల్లో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయిస్తుండడంతో మందుబాబుల ఆగడాలు అర్ధరాత్రి వరకూ కొనసాగుతున్నాయి. మద్యం మత్తులో ఘర్షణలకు దిగటం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి.దాబాల పక్కనుంచి వెళ్లే ద్విచక్ర వాహనదారులు మందు బాబుల ఆగడాలను చూసి భయాందోళనకు గురవుతున్నారు.

దాబాలకు వచ్చేవారు వారి వాహనాలు రహదారుల పక్కనే నిలుపుతుండటంతో రోడ్డుపై వెళుతున్న వాహన దారులకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా భారీవాహనాలను దాబాల పక్కన నిలిపి, మద్యం తాగుతుండడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి సమయంలో రహదారి పై ప్రాంతాలకు వెళ్లాలంటే వాహన దారులు భయాందోళనకు గురవుతున్నా రు. సరదాగా దాబాలకు కుటుంబ సభ్యులతో వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

 అడపాదడపగా పోలీసులు, ఎక్సైజ్ అధికారుల తనిఖీలు 

మెదక్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపుల ఉండే దాబాలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. దాబాల్లో మద్యం సిట్టింగ్లు కాని, మద్యం అమ్మకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. కానీ జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న దాబాల్లో పోలీసు, ఎక్సైజ్ అధికారులు అడపాదడపగా తనిఖీలు చేస్తున్నారు.

దాబాల్లోకి పోలీసులు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ తనిఖీలకు వెళ్తే ముందస్తుగానే సమాచారాన్ని చేరవేస్తున్నారు. దీంతో దాబాల నిర్వాహకులు అప్రమత్తం అవుతున్నారు. రాత్రి సమయంలో మద్యం సిట్టింగ్లను దాబాల నిర్వాహకులు చేయిస్తున్నట్లు పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. దాబాల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు ఆయా శాఖల అధికారులు తలొగ్గుతూ సక్రమంగా తనిఖీలు నిర్వహించడం లేదని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. 

ఈ దాబాల్లో మద్యంలో తాగి వాహనదారులు అతివేగంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు.