కేసీఆర్‌కు తెలిసే లిక్కర్ స్కాం
కవిత అన్ని వివరాలు తన తండ్రికి తెలిపారు
తన బృందాన్ని ఢిల్లీలో కేసీఆర్‌కు పరిచయం చేశారు
లిక్కర్ పాలసీ గురించి కేసీఆర్‌కు వివరించారు
ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఆధారాలు సమర్పణ
కేసీఆర్ మెడకు రాష్ట్రంలో ఫోన్‌ట్యాపింగ్.. హస్తినలో లిక్కర్ స్కాం
న్యూఢిల్లీ, మే 28: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీ గురించి, దాన్ని అడ్డం పెట్టుకొని సౌత్‌గ్రూప్ నడిపించిన కుంభకోణం గురించి బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ముందే తెలుసని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బాంబు పేల్చింది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పాలసీ గురించి కేసీఆర్‌కు పూర్తిగా తెలిపారని, ఆయన అధికారిక నివాసంలోనే తన బృందాన్ని కూడా ఆయనకు పరిచయం చేశారని ఈడీ తెలిపింది.
ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం దర్యాప్తు సంస్థల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కుంభ కోణంలో కవిత ప్రధాన సూత్రధారి అని నిరూపించే ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ‘కవిత తన టీం సభ్యులైన బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్‌పిళ్లుని కేసీఆర్‌కు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలోనే పరిచయం చేశారు. సమీర్ మహేంద్రను కేసీఆర్‌కు బుచ్చిబాబు పరిచయం చేశారు. మద్యం వ్యాపారం గురించి సమీర్‌ను కేసీఆర్ అడిగి తెలుసుకొన్నారు’ అని వెల్లడించారు. ఈ వివరాలన్నీ ఈ కేసు నిందితుల్లో ఒకరైన గోపికుమరన్ తన వాగ్మూలంలో తెలిపాడని చెప్పారు.
రెండేండ్లలో 11 ఫోన్లు
ఎమ్మెల్సీ కవిత రెండేండ్లలో 11 ఫోన్లు మార్చారని ఈడీ న్యాయవాది తెలిపారు. వీటిలో నాలుగు ఫోన్లలోని డాటాను ఆమె ధ్వంసం చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ఇంకా ధ్వంసం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించారు. ఆమెకు బెయిల్ ఇవ్వరాదని కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియటంతో కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 30 లేదా 31న తీర్పు వెలువరించే అవకాశం ఉన్నది.
కేసీఆర్ ప్రస్తావన రాలేదు: న్యాయవాది
ఎమ్మెల్సీ కవిత కేసులో ఈడీ బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రస్తావన చేసిందనే ప్రచారం అవాస్తమని ఆమె న్యాయవాది మోహిత్‌రావు పేర్కొన్నారు. కోర్టులో ఈడీ న్యాయవాదులు మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి ప్రస్తావించారని తెలిపారు. ఆయనను కేసీఆర్‌కు అన్వయించి కొన్ని సంస్థలు ప్రసారం చేయడం సరికాదన్నారు. ఎక్కడా కేసీఆర్ పేరు రాయలేదని, వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవరెడ్డి వాంగ్మూలం ప్రస్తావించిందన్నారు. లిక్కర్ కేసులో ఉన్న వారిని తన తండ్రికి పరిచయం చేశారని రాఘవ తెలిపారన్నారు. కొందరు కావాలనే కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
అటు లిక్కర్.. ఇటు ఫోన్ ట్యాపింగ్
పదేండ్లు తెలంగాణను ఎదురులేకుండా ఏలిన కేసీఆర్‌కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. రాష్ట్రంలో ఫోన్ ట్యాపిం గ్‌కు కేసీఆరే సూత్రధారి అని నిందితులు తమ వాంగ్మూలాల్లో తెలుపగా, అటు దేశ రాజధానిలో లిక్కర్ స్కాంలో కూడా ఆయన పేరు బయటకు రావటం సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్ పాల నలో కేసీఆర్ కనుసన్నల్లోనే ఎస్‌ఐబీ పనిచేసిందని, ఆయన వ్యతిరే కులందరి ఫోన్లు ట్యాప్ చేశామని ఈ కేసులో నిందితులుగా ఉన్న డీసీపీ రాధా కిషన్‌రావు, ఏఎస్పీ భుజంగరావు, ఏఎస్పీ తిరుపతన్న తమ కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా లిక్కర్ స్కాం కూడా కేసీఆర్‌కు తెలిసే ఆయన కూతురు ఆధ్వర్యంలోనే సాగిందని ఈడీ సాక్ష్యాలు సంపాదించటం సంచలనంగా మారింది. ఈ సాక్ష్యాల ఆధారంగా లిక్కర్ కేసులో ఈడీ కేసీఆర్‌ను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.






