30 June, 2026 | 2:29 PM

సీజనల్ వ్యాధులతో జరభద్రం

27-05-2024 12:05 AM

గత వారం రోజుల నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాస్త చల్లదనం.. ఉక్కపోతతో పిల్లల్లో.. పెద్దల్లో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పగలు ఒకరకంగా, రాత్రి ఒకరకంగా ఉండే ఉష్ణోగ్రతలకు తగినట్లుగా పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో దోమల బెడద కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. కనుక అప్రమత్తంగా ఉండాలి. ఫ్లూ, జర్వం, జలుబు లాంటి సమస్యలకు తక్షణ పరిష్కారం చూడగలిగితే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ వి.జనార్దన్ రెడ్డి సూచనలు, సలహాలు ఏంటో తెలుసుకుందాం..!

సీజన్ మారుతున్న క్రమంలో.. అక్కడక్కడ చినుకులు పడటమే ఆలస్యం పిల్లల్లో జలు బు, దగ్గు అంటూ రకరకాల సమస్యలు వస్తాయి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధులు త్వరగా వారికి వచ్చేస్తాయి. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. మరీ ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చిన్నారులపై వైరస్ దాడి మొదలవుతుంది. పిల్లలకు వెచ్చటి బట్టలు వేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను కాపాడాలి. వర్షాకాలంలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తుంటారు. కాబట్టి తరచూ డైపర్లు మార్చుస్తూ ఉండాలి. లేదంటే జర్వం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల సమస్యలు పెరుగుతాయి. వర్షాకాలంలో పిల్లలకు పరిశుభ్రత పద్ధతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 

ఫాస్ట్ ఫుడ్ తినకూడదు..

ఫాస్ట్ ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. తాగు నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే డ్రైఫ్రూట్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చడం మంచి ఫలితం ఉంటుం ది. వర్షాకాలంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా ఎక్కువే కాబట్టి కాచి చల్లార్చిన నీటినే వాడటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో పిల్లలకు పోషకాహారం పెట్టాలి. అలాగే తాజాగా వండిన ఆహారాన్ని పెట్టాలి. రోజువారి ఆహారంలో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. 

జీవన శైలిలో మార్పు..

వచ్చే నెలలో స్కూల్స్ తెరుచుకుంటాయి. ఇన్నీ రోజులు ఇళ్లకే పరిమితమైన పిల్లలు ఒక్కసారిగా బయటి వాతావరణంలోకి వచ్చేస్తారు. పొద్దున్నే నిద్రలేచి బడికి పరుగెత్తాలి. సాయంత్రం ఇంటికి రాగానే టీవీ, మొబైల్, హోంవర్క్, ట్యూషన్లు.. రాత్రయిపోతుంది. తినడం, పడుకోవడం మళ్లీ ఉదయమే లేచి బడికి పరుగెత్తడం.. ఇలా పిల్లల జీవన శైలి మారిపోతుంది. అదనంగా, వేసవిలో వేడిగా ఉన్న వాతావ రణం వర్షాల కారణంగా ఒక్కసారిగా మారిపోతుంది. ఓ వైపు వాతావరణంలో ఏర్పడిన మార్పులు, మరోపక్క అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం కొంత గందరగోళంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా కొంతమేరకు తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది. సీజనల్ వ్యాధులకు గాలి, నీరు, దోమలే ప్రధాన కార ణం. అప్పటివరకు ఉక్కపోత, వేడిగాలులతో నిండిన వాతావరణం చల్లబడి పోతుంది. దీనికితోడు వర్షాల వల్ల కొత్తనీరు వస్తుంది. నాలాలు, కుంటల్లో దోమలు, ఈగల వృద్ధి జరుగుతుంది. ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. 

వాతావరణ ప్రభావం..

ఒకటి నుంచి ఐదు ఏళ్లలోపు పిల్లల్లో ఎడినాయిడ్స్ కండరాలు, టాన్సిల్స్ ఉంటాయి. ఎడినాయిడ్స్ కండరాలు గొంతు పైభాగంలో, ముక్కుకు కొంచెం వెనక ఉంటాయి. దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుం డా ఇవి ముక్కులోనే అడ్డుకుంటాయి. ఇక, టాన్సిల్స్ గొంతులో నోటి వెనకభాగంలో ఉంటాయి. పిల్లలు పెరిగే కొద్దీ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ కనుమరుగైపోతా యి. వేసవికాలంలో వాతావరణంలో తేమ 20 శాతం లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. అయితే, వర్షాకాలం ప్రారంభంతో ఒక్కసారిగా 80 శాతానికి మించి పెరుగుతుంది. ఆ ప్రభావంతో చలిగాలులు వీస్తుంటాయి. ఆ గాలి పీల్చడం వల్ల పిల్లల ముక్కులో ఉండే ఎడినాయిడ్స్ కండరాలు, గొంతులో ఉండే టాన్సిల్స్ ఉబ్బుతాయి. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చి, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగితే అది న్యుమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. 

నీటిని కాచి చల్లార్చాలి..

కలుషితమైన నీరు అనేక వ్యాధులకు ప్రధాణ కారణం. గ్యాస్ట్రోఎంటరైటిస్ వ్యాధులైన వాంతులు, విరేచనాలు, కలరా, పచ్చకామెర్లు, అమీబియాసిస్ వంటివి అధికంగా వస్తాయి. విరేచనాలు ఎక్కువగా కావడంతో పిల్లలు డీహైడ్రేషన్ బారినపడతారు. వర్షాకాలంలో ఈగల బెడద కూడా ఎక్కువే. కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్ల ఎక్కువగా పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటివి పిల్లలపై దాడి చేస్తాయి. సాధ్యమైనంత వరకూ కాచి చల్లార్చిన నీరే ఇవ్వాలి. 


పిల్లలకు కాచి చల్లార్చిన నీటినే తాగించాలి. మినరల్ వాటర్‌పై నమ్మకం పెట్టుకోవద్దు. కాచి చల్లా ర్చిన నీరు ఇవ్వడం వల్ల నీటితో వచ్చే వ్యాధుల నుంచి 100 శాతం దూరంగా ఉండవచ్చు. 

మలేరియా, డెంగ్యూ ఇతర వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి దోమలను అరికట్టేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి తడి బట్టలు, బూట్లు తప్పనిసరిగా ఆరుబటయ ఆరబెట్టాలి.

భోజనానికి ముందు చేతులు బాగా కడుక్కునేలా పిల్లలకు చెప్పాలి.

స్కిప్పింగ్, హోపింగ్, టేబుల్ టెన్నిస్ మొదలైన ఇండోర్ ఫిజికల్ యాక్టివిటీస్ వంటి శారీరక శ్రమ కలిగించే క్రీడలను ప్రోత్సహించాలి.

దోమలు కుట్టకుండా అవసరమైతే, దోమతెర ఉపయోగించాలి.

పిల్లలను బయటి నుండి వచ్చిన తర్వాత గోరు వెచ్చని నీటితో వారి పాదాలను కడగమని చెప్పాలి. ప్లాస్టిక్, కాన్వాస్ లేదా లెదర్ బూట్లు ధరించడం మానుకోవాలి. 

ఇన్ఫెక్షన్ కలిగించే జెర్మ్స్ వ్యాప్తిని తగ్గించడానికి కలుషితమైన ప్రదేశాలు, వస్తువులను శుభ్రం చేయాలి. ఇవన్నీ తూచ తప్పక ఫాలో అయితే పిల్లలను వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. 

పిల్లలు కాటన్ మాస్క్ ధరించేలా జాగ్రత్త వహించాలి. దీనివల్ల కరోనాతో పాటు సీజనల్ వ్యాధుల నుంచి కూడా 80 శాతం మేర రక్షణ పొందవచ్చు. 

మస్కిటో రిపెలెంట్స్‌ను కాళ్లకు రుద్దుకోవడం వల్ల కూడా దోమల బారి నుంచి రక్షణ పొందవచ్చు.