సనాతన ధర్మానికి భవిష్యత్ ఉంటుంది
బాలపెరియవగా, జగద్గురువుగా, శ్రీ కంచికామకోటి పీఠాధిపతిగా శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారి ప్రేమ, కరుణ ఎల్లలు లేనివి. యువశక్తిని, భక్తిని, యుక్తిని సమన్వయం చేయటంలో శ్రీవారి స్ఫూర్తి, వేవేల ప్రవచన సమీరాలలో పరిమళభరితమవుతున్నది..
శ్రీ శంకరవిజయేంద్రసరస్వతీ స్వామివారు, శ్రీ కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతి. వేదవిద్యా స్వరూపంగా, సత్యాచార్యులుగా, జగద్గురువుగా, శిల్పకళా విద్వత్ మూర్తిగా, సనాతన ధర్మాచార్యునిగా, స్వామివారిరి త్రివిక్రమ స్వరూపం. సామాజిక స్పృహ, సంఘ సంస్కరణ, సంఘసేవ ముప్పేటగా సాగే స్వామివారి ఆలోచనా రీతి, ఒక అనుగ్రమ త్రివేణి! సంస్కృతిక, సామాజిక, సంస్కారగత జీవన ప్రవాహాన్ని ఆధ్యాత్మిక స్పర్శతో వేగంగా నడిపిస్తున్న కరుణాలయమే శ్రీ శంకరవిజయేంద్రసరస్వతీ స్వామివారు. ‘బాలపెరియవ’గా ఆవిష్కృతులైన స్వామివారు, సనాతన ధర్మాన్ని సనూతన రీతిలో ప్రజలకు బోధించి. ధర్మమార్గాలనురక్తులను చేస్తూ, పీఠ పరంపరకు మరింత సమున్నత రీతిలో ఆచార్యత్వాన్ని వహిస్తున్నారు.
యోగ, యాగ, త్యాగ రీతులన్నీ ధర్మ సంబంధులే! జగద్గురు శ్రీ శంకర విజయేంద్రసరస్వతీ స్వామివారి ఆగమనం ప్రపంచశాంతికి, విశ్వకల్యాణ స్ఫూర్తికి ఆరంభవేళ! ఇది సస్మంగళ కాలం!
‘మన ధర్మ ప్రచారం మన భారతదేశంలో మాత్రమే కాకుండా విశ్వవ్యాప్తంగా చేయాలి. భారత సంస్కృతి అనేది ఎవరికీ వ్యతిరేకమైనదికాదు. అందరినీ గౌరవించే సంస్కృతి. ఎవరికీ హాని కలిగించే తత్తం దీంట్లో లేదు. తనను కాపాడుకోవడమనేది తన సంకల్పంగా ఉండవచ్చు. కానీ, ఇతరులకి హాని కలిగించే సంస్కృతి కాదు. హానిని ఉద్దేశించే సంస్కృతి కూడా కాదు. ‘సర్వే జనాః సుఖినో భవన్తు’ అనే సంస్కృతి ఇది. అందుకని గత కాలం కన్న ధర్మ ప్రచారం ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. దీనికి, ఎదురింటి వారి పట్ల కూడా, పక్క ఇంటి వారికి కూడా వ్యతిరేక భావం మనలో లేదు. కానీ వారిలో అలా లేకుండా కూడా చేయాలి. అది కూడా మన కర్తవ్యం అయినది.
అందుకని ధర్మ ప్రచారం ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. దానికి ముందుగా మన ఇంటిని మనం బాగా చేసుకోవాలి. దానికి మనం స్వదేశేపూజ్యతే రాజ! అన్నట్లుగా! ముందు మనం చేసిన తరువాత విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే స్థాయి అనేది మనం చేసుకోవాలి. దానికి మనం వాస్తవాన్ని తెలుసుకుని, శాస్త్రాన్ని మనం తెలుసుకుని ఒక మధ్యేమార్గంలో మంచి ప్రయత్నం మనం చేస్తే మంచిది. భవిష్యత్ అనేది భారత సంస్కృతికి ఉన్నది. సనాతన ధర్మానికి భవిష్యత్ ఉంటుంది. దాని మనం ఎలా సంకల్పాలు తీసుకుంటామో. దానికి ఎలా ప్రకల్పం తీసుకుంటామో, దాన్ని బట్టి దాని ఫలితాలు ఉంటాయి.’ ఇదే వారి దివ్య సందేశం.
(శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు, జగద్గురు, శంకరాచార్య శ్రీశ్రీశ్రీ
శంకరవిజయేంద్రసరస్వతీ స్వామివారి తురీయాశ్రమ స్వీకార సన్మంగళ వేళ)
-విఎస్‌ఆర్ మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త






