27 June, 2026 | 1:32 AM

పెట్టుబడులతోనే జీవనోపాధి

27-06-2026 12:00 AM
  1. పారిశ్రామికవేత్తల కోసం వారంలో ఒకరోజు కేటాయిస్తా
  2. ఎంఎస్‌ఎంఈల వాటా పెరగాలి
  3. కంప్యూటర్ విప్లవానికి నాందీ రాజీవ్‌గాంధీ
  4.   2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థే లక్ష్యం
  5. ఐఐటీ ఎక్స్‌పో-2026లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అం టే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్ర మే కాదని, అది ప్రజల జీవనోపాధి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్ పో-2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య ఎఫ్టీసీసీఐ బలమైన వారధిగా పనిచేస్తోందన్నారు.

పారిశ్రా మిక ప్రదర్శన అంటే కేవలం యంత్రాలు, ఉత్పత్తుల ప్రదర్శన మాత్రమే కాదని, ఆలోచనలు పంచుకునే ఒక అద్భుతమైన వేదిక అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇక్కడ చిన్న వ్యాపారులకు కొత్త కస్టమర్లు, తయారీదారులకు సరికొత్త సాంకేతికత, స్టార్టప్‌లకు తొలి కొనుగోలుదారులు లభించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూరగొని పటిష్టంగా వృద్ధి చెందిందని ఆయన తెలిపారు.

హైదరాబాద్ ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. మన వృద్ధి కేవలం సేవల రంగానికే పరిమితం కాకూడదని, జీడీపీలో పారిశ్రామిక రంగం, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల వాటా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపా ధి కల్పన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఉత్పత్తి రంగం కీలకమన్నారు.

ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని, ప్రజల జీవనోపాధికి బాటలు వేయడమన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న పరిశ్రమలకు, మహిళా, గ్రామీణ పారిశ్రామికవే త్తలకు అందాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని డిప్యూటీ సీఎం వివరించారు. 

ఇందుకోసం ప్రతి శుక్రవారం ఎంఎస్‌ఎంఈ సంఘాలు, పారిశ్రామిక రంగ ప్రతిని ధులతో చర్చల కోసం సమయం కేటాయిస్తానని భట్టి ప్రకటించారు. ఈ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధనం, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై దృష్టి పెట్టడం అభినందనీయమన్నారు. దేశంలో కంప్యూటర్ విప్లవా నికి నాంది పలికిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల అన్ని కేటగిరీలపై 100 శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చిందని, కేవలం ఈవీలను వాడటమే కాకుండా వాటి సప్లై చైన్ టెక్నాలజీని ఇక్కడే అభివృద్ధి చేయడమే మన లక్ష్యమని చెప్పారు. 2035 నాటికి తెలంగాణలో 34 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

‘పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల’ విధానాన్ని తెలంగాణ 1970లోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిందని, సాంకేతికతలో తెలంగాణ ఎప్పుడూ ముందే ఉంటుందని గర్వంగా ఉందన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్ల నుంచి 18,500 మెగావాట్లకు పెరిగినప్పటికీ, రాష్ట్రంలో ఎక్కడా పవర్ కట్స్ లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు.

2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందు కోసం ప్రభుత్వ పెట్టుబడులతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్‌ను ప్రో త్సహించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తెలంగాణలో పె ట్టుబడులు పెట్టాలని పిలుపు నిచ్చారు.

ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో తెలంగా ణ ముఖచిత్రం మారబోతోందని తేల్చి చెప్పారు. పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, విద్యార్థులు ఈ ఎక్స్‌పోను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.