2 July, 2026 | 1:17 AM

బతుకులు బుగ్గి

02-07-2026 12:17 AM
  1. ట్రక్కును బస్సు ఢీకొట్టగా అగ్నిప్రమాదం
  2. 8 మంది దుర్మరణం
  3. రాజస్థాన్ దౌసాలో ప్రమాదం

జైపూర్, జూలై 1: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే ధనవాడ సమీపంలో బుధవారం ఉదయం ఇందౌర్‌కు చెందిన స్లీపర్ బస్సు ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 29 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థతి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు రిషికేష్ నుంచి ఇందౌర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న దౌసా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీయూష్ దీక్షిత్, అడిషనల్ ఎస్పీ యోగేంద్ర ఫౌజ్‌దార్‌లతో కూడిన భారీ పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.

తీవ్రంగా గాయపడిన 17 మందిని దౌసా జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నామన్నారు. ఐదుగురు ప్రయాణికులు మంటల్లోనే సజీవ దహనం అయ్యారని, మరో ముగ్గురు తీవ్రగాయాలై మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.