పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
సీఎస్‌కు గెజిటెడ్ అధికారుల వినతి
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, లోక్‌సభ ఎన్నికల విధులు నిర్వహించిన అధికారుల రెమ్యూనరేషన్‌లో వ్యత్యాసాలను తొలగించాలని కోరుతూ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమెను సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగుల, పెన్షనర్లతో సహా ప్రభుత్వం సమాన కాంట్రీబ్యూషన్‌తో కూడిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలన్నారు.
అదేవిధంగా మే నెలలో పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు పదోన్నతులు పొందేలా ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని, 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీల జోవోను ఎత్తివేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన 144 మందిని తెలంగాణకు తిరిగి కేటాయించిన ఫైల్‌కు సంబంధించి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలన్నారు.
12.5 శాతం హెచ్‌ఓడీ ఉద్యోగులను సచివాలయం సర్వీసుల్లోకి తీసుకునే జీవోను అమలు చేయాలని, 317 జీవోకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అదనపు క్యాడర్ స్ట్రెంత్‌ను మంజూరు చేయాలని, గోపన్నపల్లిలో 101 ఎకరాల హౌస్ సైట్లకు చెందిన భూమిని అలియనేషన్ చేయాలని, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలనే తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. సీఎస్‌ను కలిసినవారిలో ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్, కార్యదర్శి ఏ సత్యనారాయణ, శ్యామ్, పరమేశ్వరరెడ్డి, ఎంవీ రమణ, కిషన్ తదితరులు ఉన్నారు.




