లోకల్.. నాన్ లోకల్ లొల్లి
రంగారెడ్డిలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులు
కోర్టు కేసులు తేలక ఇంకా పెండింగ్‌లోనే..
న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేల చుట్టూ టీచర్ల ప్రదక్షిణలు
బదిలీ ప్రక్రియ చేపట్టాలని టీచర్ సంఘాల డిమాండ్
రంగారెడ్డి, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఈ నెల 7 నుంచి 20 వరకు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ జీవోను జారీ చేసింది. 32 జిల్లాలో ఈ ప్రక్రియ సజావుగా సాగగా రంగారెడ్డి జిల్లాలో మాత్రం కోర్టు కేసుల కారణంతో నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం 317 జీవో ప్రకారం 2023 ఆగస్టులో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను చేపట్టింది. స్పౌజ్ పేరిట, అనారోగ్య సమస్యల పేరిట నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, పదోన్నతులు చేపడుతున్నారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం కేవలం జీహెచ్‌ఎంలను బదిలీ చేసి అనంతరం ప్రక్రియను నిలిపివేసింది. తదంతరం ఎన్నికలు రావడంతో ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది.
కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనంతరం మళ్లీ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు కలిపి 1,351 ఉండగా అన్ని కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు మొత్తం 6,100 మంది ఉన్నారు. గతంలో 5 వేల మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకొన్నారు. అందులో ఎస్జీటీకి చెందిన వారు 2,200 మంది ఉండగా మిగతా వారు స్కూల్ అసిస్టెంట్, పండితులు, పీఈటీ, పీడీలు ఉన్నారు. వీరంతా దాదాపుగా 10 నుంచి 14 ఏళ్లకు పైగా ఒకే చోట ఇప్పటివరకు విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. జిల్లాలో బదిలీలు, పదోన్నతుల కారణంగా సుమారుగా 1,600 మంది ఉపాధ్యాయులకు న్యాయం జరగగా అందులో 700 నుంచి 800 వరకు పదోన్నతులు రానున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు.
317 జీవో పీటముడి
317 జీవోను అడ్డంపెట్టుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించిన పలువురు ఉపాధ్యాయులు తమ పలుకుబడి, పైరవీల ద్వారా అక్రమంగా వంద మందికిపైగా రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారంటూ స్థానిక ఉపాధ్యాయులు ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. సీఎంవో స్థాయిలో పైరవీలు చేసుకొని నల్లొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మహబుబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారంతా ఇక్కడికి రావడంతో తమకు నష్టం వాటిల్లుతుందని స్థానిక ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు.
సేవ్ రంగారెడ్డి పేరిటా ఐక్య కార్యచరణ రూపొందించి రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 కారణంగా తాము స్థానికుల నుంచి స్థానికేతరులం కావాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కోర్టు కేసు విషయంలో నిర్ణీత సమయంలో స్పందించకపోవడం కారణంగానే ఉపాధ్యాయుల బదిలీల, పదోన్నతుల ప్రక్రియకు తీవ్ర జాప్యం జరిగిందని ఉపాధ్యాయులు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కోర్టు పరిధిలో ఉన్న సమస్యకు పరిష్కారం తీసుకురావాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పది మండలాల టీచర్ల ఆవేదన
కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన పది మండలాల ఉపాధ్యాయులు తమకు న్యాయపరంగా రావాల్సిన బదిలీలు, పదోన్నతుల విషయంలో స్థానిక ఉపాధ్యాయులు తమను స్థానికేతరులకుగా భావిస్తూ అవహేళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు కలిసి వేడుకున్నారు. బదిలీల ప్రక్రియ నిలిచిన కారణంగా జిల్లాలోని దాదాపుగా 17 ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రత్యేక సమావేశమయ్యారు. అక్రమంగా జిల్లాకు బదిలీపై వచ్చిన వారిపై చర్యలు తీసుకొవాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నిరుద్యోగులకు తీరని నష్టం
రంగారెడ్డి జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువత బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. స్థానికేతర ఉపాధ్యాయులు రంగారెడ్డి జిల్లాకు అక్రమంగా బదిలీపై రావడంతో ఉద్యోగ పోస్టులు ఖాళీలు ఏర్పడే పరిస్థితి లేదంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. 2022 వరకు జిల్లాలో 738 పోస్టులు ఖాళీగా ఉంటే ప్రస్తుతం 308 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. స్వార్థపూరితంగా కోర్టును
ఆశ్రయించారు..
కొందరు విద్యాశాఖ ఉన్నతాధికారుల సహకారంతో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు స్వార్థపూరితంగా కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేతలు వెంకట్‌రెడ్డి, విజయ్‌సాగర్, శ్రీనివాస్, సాగర్, కిష్టారెడ్డి వేణుగోపాల్, పద్మావతమ్మ, నాగేంద్రం, దేవయ్య, పద్మజరాణి ఆరోపించారు. జిల్లాలో 24 శాతం హెచ్‌ఆర్ పొందుతున్న ఉపాధ్యాయులు ఎల్ల కాలం ఇక్కడే పనిచేయడం కారణంగా సుమారుగా 13 ఏళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ బదిలీలు, పదోన్నతులు లేక పలువురు ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపి కోర్టు స్టేను తొలగింపజేసి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరు తున్నారు.
నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలి
రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత షెడ్యూల్ ప్రకారమే అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలి. జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యను ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి, పరిష్కరించాలి.
కాశీరావు, తపస్ జిల్లా
అధ్యక్షుడు, రంగారెడ్డి




