కొత్త పంచాయతీలకు నిధుల గ్రహణం
వెల్దుర్తి, జూన్ 27: ప్రజా పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వ హయాంలో నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. కొత్త పంచాయతీల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణాల కోసం స్థలాలను కేటాయించి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. వెల్దుర్తి మండలంలో చెర్లపల్లి, ఆరెగూడెం గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఈ గ్రామాల్లో పంచాయతీ సొంత భవనాల కోసం రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. దీంతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు.
ఆరెగూడెంలో పిల్లర్లు వేసి స్లాబ్ వరకు నిర్మాణం చేపట్టారు. చెర్లపల్లి గ్రామంలో మాత్రం పిల్లర్ల స్థాయిలో నిర్మాణం పనులు నిలిచిపోయాయి. ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్లకు రూ.9.50 లక్షల బిల్లులు చెల్లించారు. తదనంతరం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో బిల్లుల మంజూరు నిలిచిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బిల్లులు వస్తాయో, రావోనని కాంట్రాక్టర్లు భవనాల నిర్మాణాలు అక్కడివరకే నిలిపివేశారు. దీంతో కొత్త పంచాయతీల్లో సొంత భవనాలు పూర్తికాక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు.
సెప్టెంబర్ వరకు నిధులు వస్తాయి..
ఎన్నికల కోడ్ ఉండడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పంచాయతీ భవనాల నిర్మాణాలకు పెండింగ్ బిల్లులు మంజూరు కాలేదు. రూ.20 లక్షల నిధులకు ఇప్పటికే రూ.9.50 లక్షల చొప్పున మంజూరయ్యాయి. మిగతా నిధులు సెప్టెంబరు వరకు వచ్చే అవకాశం ఉంది. రాగానే భవన నిర్మాణాలు పూర్తి చేయిస్తాం.
పవన్‌కుమార్, పంచాయతీరాజ్ ఏఈ, వెల్దుర్తి




