15 April, 2026 | 11:03 AM

స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: తెలంగాణ హైకోర్టు

17-10-2025 02:17 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై(Local body elections) హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు(Telangana High Court) ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ లో ఎక్కడా లేదు అని ఈసీ తరుపు న్యాయవాది తెలిపారు. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఎన్నికల సంఘం న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై 42 శాతం పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చాం.. కాబట్టే ఆ నోటిఫికేషన్ సస్పెండ్ చేశామని ఈసీ పేర్కొంది. ప్రభుత్వంతో చర్చించాకే రీ-నోటిఫికేషన్ ఉంటుందని ఈసీ న్యాయవాది అన్నారు. 2 వారాల సమయం కావాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరాయి.

ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్(Election Commission) చర్చించి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా, రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు. అక్టోబర్ 9 తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికపై తదుపరి విచారణ తెలంగాణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం(BC Reservations) రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ జీవో పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చూస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అక్కడ కూడా బీసీ రిజర్వేషన్లపై భారీ షాక్ తగిలింది. హైకోర్టులో విచారణలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెబుతూ పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.