రైతువేదిక భవనాలకు తాళాలు
నిర్మించారు.. వదిలేశారు..
ఒక్కో రైతు వేదిక భవనానికి రూ.22 లక్షలు
పట్టించుకోని అధికారులు
తాడ్వాయి, మార్చి, 20 (విజయక్రాంతి): రైతులకు అన్ని విధాలుగా సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి రైతు వేదిక భవనాలను నిర్మించింది. రైతులకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.వ్యవసాయ శాఖ అధికారులకు మండల కేంద్రాలలో సరైన భవనాల ఏర్పాట్లు లేకపోవడంతో అధికారులు రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నారని ప్రభుత్వం భావించింది.
అధికారులను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రైతు వేదిక భవనాలను నిర్మించింది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో శ్రమించి నిర్మించిన రైతు వేదిక భవనాలు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. అందుబాటులో ఉండాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో లేకుండా పోతున్నారు. - కామారెడ్డి జిల్లాలో నిర్మించిన రైతు వేదిక భవనాలకు తాళాలు వేసి ఉంటున్నాయి.
సంబంధిత అధికారులు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు తాళాలు తీస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రైతులకు ఎరువులు అవసరమైనప్పుడు, విత్తనాలు అవసరమైనప్పుడు రైతు వేదికలను తెరిచి సదరు వ్యవసాయ శాఖ విస్తీర్ణాధికారులు రైతు వేదికలలో ఉంటున్నారు. అనంతరం రైతు వేదికలను తెరవడం లేదు. వారం వారం నిర్వహించే సమావేశాల సమయంలో తెరుస్తున్నారు.దీంతో ప్రభుత్వ లక్ష్యానికి గండి పడుతుంది.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లోని రైతు వేదిక భవనాలు తాళాలు వేసి ఉంటున్నాయి. ఒక్క తాడ్వాయి మండలంలోనే కాకుండా జిల్లాలోని రాజంపేట, భిక్కనూర్, గాంధారి,సదాశివనగర్, లింగంపేట,ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ మండలాల్లో సైతం రైతు వేదిక భవనాలు తెరుచుకోవడం లేదు. ప్రతిరోజు భవనాలు తెరిచి ఉంచి సదరు అధికారులు అందుబాటులో ఉన్నట్లయితే రైతులకు సూచనలు, సలహాలు అందే అవకాశం ఉంటుంది.
5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు
- ప్రభుత్వం 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసింది. సంబంధిత క్లస్టర్ లలో ఒక రైతు వేదిక భవనాన్ని నిర్మించింది. ఈ భవనంలో సదరు వ్యవసాయ శాఖ విస్తీర్ణాధికారి భవనంలో అందుబాటులో ఉండి రైతులకు సూచనలు సలహాలు ఇవ్వాలని అధికారులు భావించారు.రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సూచనలు సలహాలు పొంది పంట దిగుబడిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుం దని ప్రభుత్వం సంకల్పించింది.
కానీ సదరు బాధ్యత గల అధికారులు క్లస్టర్లకు కాదు కదా మండలానికి ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలు వృధాగా ఉండిపోతున్నాయి.
ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షలు ఖర్చు
ప్రభుత్వం ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. రైతు వేదిక భవనాలను నిర్మించడమే కాకుండా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు సైతం చేసింది ఒక్కో క్లస్టర్ పరిధిలో ఒక్కో ఏఈఓ ను ప్రభుత్వం నియమించింది. మండలంలో ఎక్కువ సంఖ్యలో ఏ ఈ ఓ లు ఉన్నట్లయితే రైతులకు అందుబాటులో ఉంటారని రైతులకు అధికారుల నుంచి సరైన సూచనలు అందుతాయని భావించింది.
కానీ సదరు బాధ్యతగల అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాము వేసుకున్న పొలానికి చీడపీడలు వచ్చిన సమయంలో గతంలో సంప్రదించినట్లే పురుగుమందుల దుకాణ వ్యాపారులను సంప్రదించి సలహాలు పొంది వారు ఇచ్చిన పురుగుమందులను పిచికారి చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ప్రతి రైతు పొలం వద్దకు ఏ ఈ ఓ లు వెళ్లి చీడపీడలను పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించింది.
విరిగిపోతున్న తలుపులు
రైతు వేదిక భవనాలను నిర్మించి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇప్పుడే రైతు వేదికలకు అమర్చిన తలుపులు విరిగిపోతున్నాయి. రైతు వేదికల పక్కనే నిర్మించిన మరుగుదొడ్లు అద్వాన్నంగా మారుతున్నాయి. వాటిని సక్రమంగా ఉపయోగించకపోవడంతో అధ్వానంగా మారుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. రైతు వేదికలను నిర్మించిన సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే నిర్మించిన ఆరు సంవత్సరాలకే తలుపులు విరిగిపోతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతిరోజు రైతు రైతు వేదికలను తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతు వేదికలు తెరచుకోకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కాని స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిరోజు రైతు వేదికలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.




