calender_icon.png 28 May, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ రిఫండ్ కోసం చూస్తున్నారా?

04-08-2024 02:06:16 AM

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలకు జూలై 31 గడువు ముగిసింది. గడువుతేదీనాటికి రికార్డుస్థాయిలో 7.28 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలైనట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గడువుతేదీనాటికి 6.21 కోట్ల ఐటీఆర్‌లు ఈవెరిఫై అయ్యాయన్నది. ఈవెరిఫై అయినవాటిలో జూలై 31నాటికి 2.69 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేశామని తెలిపింది. ఇంకా 4 కోట్లకుపైగా రిటర్న్‌లు ప్రాసెస్ కావాల్సి ఉన్నది. ఈవెరిఫై అయితేనే రిటర్న్‌ను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేస్తుందని, ప్రాసెస్ అయిన తర్వాతే రిఫండ్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందన్న సంగతి గుర్తుంచుకోండి. ఇప్పటికే పలువురికి రిఫండ్స్ అందినప్పటికీ, చాలామంది రిఫండ్ కోసం వేచిచూస్తుంటారు. ఐటీ రిఫండ్ వస్తే ఆ ఇంట్లో పండుగే. 

రిఫండ్ రావడానికి ఎంత కాలం?

మనం ఫైల్ చేసే ఐటీఆర్ ఫారంకు అనుగుణంగా రిఫండ్ వచ్చే సమయం మారుతుంది. ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో పొందుపర్చిన సమాచారం ప్రకారం ట్యాక్స్‌పేయర్ తన రిటర్న్‌ను ఈవెరిఫై చేసిన తర్వాతే రిఫండ్ ప్రాసెసింగ్ మొదలవుతుంది. ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత ట్యాక్స్‌పేయర్ బ్యాంక్ ఖాతాలో రిఫండ్ జమకావడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టవచ్చు. ఈ సమయంలోపు రిఫండ్ జమకాకపోతే, ఐటీఆర్‌లో ఉన్న తేడాలపై తాము పంపించే సమాచారాన్ని ఈ మెయిల్‌లో చెక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ పేయర్లకు సూచించింది. చాలా మందికి నిర్దేశిత సమయంలోనే రిఫండ్ వచ్చేస్తుంది. మరికొంతమందికి జాప్యం కావచ్చు. 

ఇతర కాంప్లెక్స్ ఫారాలైన ఐటీఆర్ 3 వంటివాటితో పోలిస్తే సరళమైన ఐటీఆర్ 1 ప్రాసెసింగ్ త్వరితంగా జరుగుతుందని సోమయ్య విద్యావిహార్ యూనివర్సీటీ అసిస్టెంట్ డైరెక్టర్, చార్టర్డ్ అకౌంటెంట్ ముస్కాన్ కుక్రేజా చెప్పారు. బిజినెస్ లేదా ప్రొఫెషనల్ ఆదాయం గల వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఐటీఆర్ 3ని ఉపయోగిస్తాయని తెలిపారు. తమ క్లయింట్లలో కొంతమందికి ట్యాక్స్ రిఫండ్ వారంలోపే వచ్చేసిందని, మరికొందరి రిటర్న్‌లు ఇంకా ప్రాసెస్ కాలేదని భన్సాల్ తెలిపారు. ఈ ఏడాది ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 దాఖలు చేసిన వ్యక్తిగత క్లెయింట్లకు రిఫండ్స్ సాధారణంగా 20 రోజుల్లో రిఫండ్స్ ప్రాసెస్ అయ్యాయని, కొంతమందికి మాత్రం వారం లోపు లేదా రెండు, మూడు రోజుల్లో ఐటీఆర్‌లు ప్రాసెస్ అయిన సందర్భాలు ఉన్నాయని భన్సాల్ వివరించారు. రిటర్న్ సంక్లిష్టత, అందులో సమర్పించిన సమాచారం ఖచ్చితత్వం ఆధారంగా ప్రాసెసింగ్ సమయం పడుతుందని చెప్పారు.  

ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌కు ఎంత సమయం?

ట్యాక్స్ పేయర్ దాఖలు చేసే ఐటీఆర్ ఫారం రకాన్నిబట్టి ప్రాసెసింగ్ సమయం ఉంటుందని ట్యాక్స్ నిపుణులు చెపుతున్నారు. 

ఐటీఆర్ 3: ఈ ఫారం ప్రాసెసింగ్‌కు 30 నుంచి 60 రోజల వరకూ సమయం పడుతుంది. ఐటీఆర్ 3లో వ్యాపార ఆదాయంతో పాటు క్లిష్టమైన గణాంకాల్ని నోట్ చేస్తా రు. అందుచేత వీటిని క్షుణ్ణంగా స్క్రూటినీ చేయాల్సి ఉంటుందని సింఘానియా అండ్ కో పార్టనర్ అమిత్ భన్సాల్ తెలిపారు. 

ఐటీఆర్ 2: ఈ ఫారంలో ఇచ్చిన రిటర్న్‌ను ప్రాసెస్ చేయడానికి 20 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో మరింత సమాచారం అవసరమైతే అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చని భన్సాల్ చెప్పారు. ఐటీఆర్ 2లో పొందుపర్చే క్యాపిటల్ గెయిన్స్ తదితర వివరాల్ని ఐటీ శాఖ స్క్రూటినీ చేస్తుందని, అందుచేత వాటి ప్రాసెసింగ్ సమయం అధికంగా ఉంటుందన్నారు. 

ఐటీఆర్ 1: ఈ ఐటీఆర్ 1 ప్రాసెసింగ్ మాత్రం త్వరితగతిన జరిగిపోతుంది. కేవలం జీత భత్యాలనే అందుకునే ట్యాక్స్ పేయర్లు వారి ఫారం 16 ఆధారంగా ఫైల్ చేసే రిటర్న్‌లు 10 రోజుల లోపుగానే ప్రాసెస్ అయిపోతాయని, రిఫండ్స్ 15 రోజుల్లోపు అందుకుంటారని ఇంటర్నేషనల్ ట్యాక్స్ లాయర్ ఆదిత్యా రెడ్డి తెలిపారు.