calender_icon.png 29 May, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంచనాల్ని మించిన ఎస్బీఐ

04-08-2024 02:04:20 AM

నికరలాభం రూ. 17,035 కోట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 3: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నికరలాభం ఏప్రిల్‌జూన్ తొలి త్రైమాసికంలో అంచనాల్ని మించింది. నిరుడు ఇదేకాలంతో పోలిస్తే బ్యాంక్ నికరలాభం రూ.16,884 కోట్ల నుంచి రూ. 17,035 కోట్లకు చేరింది. మెజారిటీ విశ్లేషకుల అంచనా రూ. 16,800 కోట్లుకాగా, అంతకు మించిన లాభాన్నే ప్రదర్శించగలిగింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.1,08,039 కోట్ల నుంచి రూ. 1,22,688 కోట్లకు చేరినట్టు శనివారం ఎస్బీఐ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.

బ్యాంక్ వడ్డీ ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 95,975 కోట్ల నుంచి రూ. 1,11,526 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 2.76 శాతం నుంచి 2.21 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.71 శాతం నుంచి 0.57 శాతానికి మెరుగుపడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్బీఐ నికరలాభం స్వల్పంగా పెరిగి రూ. 18,537 కోట్ల నుంచి రూ. 19,325 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 1,32,333 కోట్ల నుంచి రూ. 1,52,125 కోట్లకు చేరింది. 

రూ.25,000 కోట్ల నిధుల సమీకరణ

బాండ్ల జారీద్వారా రూ. 25,000 కోట్ల నిధుల సమీకరణకు బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బసెల్ 3 నిబంధనల మేరకు టైర్ 1, టైర్ 2 బాండ్లను దేశీయ లేదా అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు జారీచేసి రూ. 25,000 కోట్లను సమీకరించాలన్నది బ్యాంక్ ప్రతిపాదన. కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి లోబడి  నిధుల్ని సమీకరించనున్నట్టు ఎస్బీఐ తెలిపింది.