calender_icon.png 15 November, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో ప్రమాదం జరగకముందే మేలుకుంటే మేలు

15-11-2025 12:57:08 AM

నిర్లక్ష్యంగా నిలిపి నిండు ప్రాణాలు బలి

ప్రమాద కారకాలుగా మారుతున్న లారీలు, ట్రాక్టర్లు 

పాపన్నపేట,(విజయక్రాంతి): ప్రధాన రహదారుల పక్కనే భారీ వాహనాలను నిలపడంతో ఆ మార్గాన వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. అయినా కొంతమంది వాహనదారులకు అవేం పట్టడం లేదు. పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో ఉన్న ధాన్యం మిల్లు వద్ద లారీలు, ట్రాక్టర్లను రోడ్డు కిరువైపులా నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రైస్ మిల్లు ముందు రెండు వైపులా వాహనాలు నిలిపి ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఎదురుగా వచ్చే వాహనాల లైటు కాంతికి రైసు మిల్లు ముందు నిలిపిన వాహనాలు కనపడక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత సంవత్సరం ఈదే సమయంలో ఈ మిల్లు ముందే కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గతంలో ఓ యువకుడు సైతం ఆటోతో వెనుక నుంచి ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడిన ఘటన సైతం చోటుచేసుకుంది. అధికారులు స్పందించి రోడ్డు పక్కన వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.