16 March, 2026 | 6:39 AM

రాత్రంతా ఆన్‌లో బైక్ పొగపీల్చి నలుగురి మృతి

16-03-2026 01:24 AM

మృతుల్లో తాత, మనవడు, ఇద్దరు మనువరాళ్లు

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘటన

అన్నమయ్య, మార్చి 15: రాత్రి అంతా బైక్ నుంచి వచ్చే పొగపీల్చి, నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో ఆదివారం జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనువరాళ్లుగా గుర్తించారు. త్యాగరాజు వీధికి చెందిన మురళి, రేవతి భార్యాభర్తలు. మురళికి తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కుమార్తె(కవలలు)లు చరిత, చందన ఉన్నారు.

మురళి శనివారం తన బైక్‌ను మెకానిక్ వద్ద మరమ్మతు చేయించాడు. ఇంజన్ సమస్య ఉండటంతో బోర్ చేయించిన అనంతరం బైక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రంతా బైక్‌ను ఆన్‌చేసి ఉంచాలని మెకానిక్ చెప్పడంతో ఇంట్లో తలుపులు వేసి, ఇంజన్‌ను ఆన్‌చేశాడు. శనివారం రాత్రి తండ్రి, మనవడు, మనవరాళ్లు ఇం ట్లో నిద్రించగా, మురళి, రేవతి ఇంటిపైన గదిలో పడుకున్నారు.

ఇల్లు ఇరుకుగా ఉండటం, మరోవైపు గాలి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాత్రంతా బైక్ నుంచి వచ్చిన పొగ గదిని కమ్మేసింది. దీంతో నిద్రిస్తున్న నలుగురు ఆ పొగను పీల్చి మృతిచెందారు. ఒకే ఇంట్లో ఒకే రాత్రి నలుగురు చనిపోవడంతో రేవతి, మురళి రోదనలు మిన్నంటాయి. కుటుంబీకులు, అక్కడికి వచ్చిన స్థానికుల ఏడుపులతో పుంగనూరులో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే భార్యాభర్తలు ఇంటి పైన గదిలో ఎందుకు ని ద్రించారు? ఇరుకుగా ఉన్న గదిలో బైక్‌ను ఎందుకు పెట్టినట్లు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.