calender_icon.png 4 May, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్తాపూర్‌లో లాపతా!

04-05-2025 01:37:40 AM

ప్రాజెక్టు పాతబస్తీ.. ప్రచారం అత్తాపూర్!

  1. కాసాగ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ చెప్పేదొకటి.. చేసేదొకటి
  2. వినియోగదారులకు రియల్ సంస్థ టోకరా! 
  3. పునాదులు కూడా పడలేదు.. అప్పుడే బుకింగ్స్
  4. ‘రెరా’ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం
  5. కోట్ల రూపాయలతో ప్రచారం.. జనాన్ని బురిడీ కొట్టించేందుకు యత్నం 
  6. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్  

(బర్క ప్రవీణ్ యాదవ్) :

రాజేంద్రనగర్, మే ౩ (విజయక్రాంతి): ప్రాజెక్టు ఉన్నది పాతబస్తీ.. ప్రచారమేమో అత్తాపూర్‌లో ఉందని.. ఇది కాసాగ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ క్షేత్రస్థాయి పరిస్థితి. ఇటీవల దినదినాభివృద్ధి చెందుతున్న అత్తాపూర్ పేరును కాసాగ్రాండ్ తన స్వార్థానికి వినియోగించుకుంటున్నది.

వాస్తవానికి కాసా గ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఉన్న కార్వాన్ నియోజక వర్గం.. మోఘల్‌కా నాలా సమీపాన కనకదుర్గా కాలనీలో ఉంది. కానీ, కాసాగ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ యాజమాన్యం మాత్రం అత్తాపూర్‌లో తమ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని ప్రచారం చేస్తూ వినియోగదారు లను నిలువునా మోసం చేస్తున్నది. 

ఆర్భాటంగా ప్రారంభం 

కాసాగ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ  ఇటీవల ఓ ప్రముఖ సినీ హీరోతో ఆర్భాటంగా శంకుస్థాపన చేయించింది. కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంది. 4.8 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు జీ ప్లస్ 35 స్కై స్క్రేపర్‌గా నిర్మిస్తుంది. ఇందులో మొత్తం 405 ప్లాట్లను నిర్మిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచస్థాయి సదుపాయాలను కల్పిస్తున్నట్టు కాసా గ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ ప్రచారం ఊదరగొడుతున్నది.

క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తిస్థాయిలో పునాదులు కూడా తీయలేదు. అప్పుడే బుకింగ్స్ అంటూ అమాయక వినియోగదారులకు గాలం వేయడం ప్రారంభించింది. గుడిమల్కాపూర్ డివిజన్లో ఉన్న ఈ ప్రాజెక్టు వద్ద భారీగా మార్కెటింగ్ ఆఫీస్‌ను కూడా ప్రారంభించింది. ఎర్లీబడ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలుకుతున్నది. ఈ ప్రాజెక్టులో 3, 4 పడక గదులను నిర్మిస్తున్నామని చెప్తుంది.

ఇప్పటికిప్పుడే 3 బీహెచ్‌కే బుక్ చేసుకుంటే రూ.౧.80 కోట్లు, నాలుగు పడక గదుల ఫ్లాట్ బుక్ చేసుకుంటే రూ.2.4 కోట్లకు ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నది. 5 పడక గదుల ఫ్లోర్ విల్లాస్ అయితే రూ.3.2 కోట్లకే ఇస్తామని చెప్తోంది. నిర్మాణం పూర్తయితే ఈ రేట్లు పెరుగుతాయని జనాలను మభ్యపెడుతుంది. మొత్తం 405 యూనిట్లు అయితే ప్రస్తుతం 154 యూనిట్లు అందుబాటులో ఉన్నట్లు చెప్తున్నారు. 

మూడేళ్లలో ఎలా సాధ్యం? 

కాసా గ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ యాజమాన్యం వినియోగదారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు 200 గజాల్లో జీ ప్లస్ 2 ఇల్లు నిర్మించుకునేందుకే సుమారు ఏడాది సమయం పడుతుండగా జీ ప్లస్ 35 ఫ్లోర్లు నిర్మిస్తున్న కాసా గ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ యాజమాన్యం మాత్రం మూడేళ్లలో వినిగదారులకు అందజేస్తామని చెప్తుండటం గమనార్హం.

చేతులెత్తేస్తున్న నిర్మాణ సంస్థలు 

చాలా సందర్భాల్లో బుకింగ్స్ తీసుకొంటున్న నిర్మాణ సంస్థలు, డెవలప్మెంట్ సంస్థలు జనాలకు సమయానికి ఇండ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతాయి. పునాదులు తీయకుండానే వినియోగదారుల నుంచి వీలైన కాడికి డబ్బులు వసూలు చేసి మధ్యలోనే చేతులెత్తేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా సంస్థలపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.

బాధితులు చాలామంది రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేసిన ఉదంతాలు కూడా లేకపోలేదు. కాసా గ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు హితవు పలుకుతున్నారు.

..అయితే ఏంటి?

కాసాగ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ కార్వాన్ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్ డివిజన్‌లో ఉంది కదా.. ప్రాజెక్టు అత్తాపూర్‌లో ఉన్నట్టు తప్పుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రాజెక్టు జీఎం చైతన్యను ‘విజయక్రాంతి’ ప్రతినిధి  వివరణ కోరగా.. ‘ఇందులో తప్పేముంది.. అది అసలు విషయమే కాదు కదా..?’ అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.

‘మార్కెటింగ్ వాళ్లు అత్తాపూర్ అని పెట్టినట్టున్నారు.. దానిని మార్పిస్తాంలే’ అని అంతే నిర్లక్ష్యంగా చెప్పడం గమనార్హం. ప్రాజెక్టు అత్తాపూర్‌లో ఉందని చెప్పి వినియోగదారులను వెంటనే ఆకట్టుకోవచ్చనే ఉద్దేశంతో కాసాగ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ ప్రాజెక్టు నిర్వాహకులు అలా చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు.