04-05-2025 12:14:46 AM
క్రికెటర్లు బాలీవుడ్ నటీమణుల మధ్య వైవాహిక సంబంధాలు కొత్తేమీకాదు. అది షర్మిలా ఠాగూర్--మన్సూర్ అలీ ఖాన్ పటౌడి అయినా, అనుష్కశర్మ--విరాట్ కోహ్లీ అయినా, సాగరిక ఖాన్ అయినా గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే వుంది. అయితే కొన్ని బంధాలు చివరికంటా విజయవంతంగా కొనసాగుతూవుంటే మరి కొన్ని మధ్యలోనే అర్ధంతరంగా ఆగిపోతూవుంటాయి.
మరీ ముఖ్యంగా దేశ సరిహద్దులు దాటిన బాలీవుడ్ ప్రేమలు ఎక్కువ కాలం నిలిచిన దాఖలాలు లేనేలేవని చెప్పవచ్చు. వాటిలో ముందుగా గుర్తొచ్చేపేరు ఒకప్పటి బాలీవుడ్ ముద్దుగుమ్మ రీనా రాయ్ ౠ పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ జంట.
రీనా రాయ్ 70,80లలో ప్రముఖ బాలీవుడ్ నటి. అప్పట్లో హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. రీనా రాయ్ నటిగా తన కెరీర్ని 15 ఏళ్ల వయస్సులో ప్రారంభించింది. తన మొదటి సినిమా జరూరత్ 1972లో విడుదలైంది. కాళీచరణ్, విశ్వనాథ్, అప్నాపన్, నాగిన్, జఖ్మి, జానీ దుష్మన్, ఆశా, అర్పన్, ఆశాజ్యోతి, నసీబ్, సనమ్ తేరీ కసమ్ వంటి తదితర చిత్రాల్లో కథానాయికగా నటించింది రీనా రాయ్.
గ్లామర్ ప్రపంచంలోని ఇతర నటీ నటుల మా దిరిగానే రీనా రాయ్ వ్యక్తిగత జీవితం కూడా అప్ప ట్లో ఎక్కువగా చర్చనీయాంశమైన అంశం. రీనా బా లీవుడ్లో అడుగుపెట్టిన కొత్తలోనే శతృఘ్న సిన్హాను పిచ్చిగా ప్రేమించిందని చెబుతారు. అయితే, విధి రాత వేరే ఉండటంతో శతృఘ్న సిన్హా 1980లో పూనమ్ సిన్హాను వివాహం చేసుకుని స్థిరపడ్డారు.
వైరాగ్యం నుంచి ఊరట...
శతృఘ్న సిన్హాతో ప్రేమ వైఫల్యం రీనా రాయ్‌ను చాలా కలచివేసింది. సరిగ్గా ఆ సమయంలోనే పరిచయం అయ్యాడు.. మొహిసిన్ ఖాన్. అతని చెలిమి ఆమెకు గొప్ప ఊరటైంది. ఆ ఆదరణ ఆమె మనసుకు అయిన గాయాన్ని మాన్పేసింది. ఆ సాన్నిహి త్యం ప్రేమగా మారింది. ఈ జంట తరచూ కలసుకోవడం, కలసి బయటకు వెళ్లడం, సహజంగానే సినిమా పత్రికలకు ఆసక్తిరేపాయి. రీనా, మొహిసిన్ డేటింగ్ అంటూ కథనాలనూ ప్రచురించాయి.
కరాచీలో పెళ్ళి..
ఇరు రంగాల్లోని ఈ ఇరువురి అభిమానులు వీళ్ల ప్రేమకథనాలను ఆస్వాదిస్తూండగా.. ఆ జంట పెళ్లి వార్త బయటకు వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ ఇద్దరూ కరాచీలో రహస్యంగా నిఖా చేసుకుని ముంబై వచ్చారు. ‘మొహిసిన్ సంగతేమో కానీ ఈ పెళ్లితో రీనా తన కెరీర్‌ను తానే ఎండ్ కార్డ్ వేసుకుంది అని అభిప్రాయపడ్డారు కానీ వాళ్ల అంచనాలకు విరుద్ధంగా పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది రీనా.
జీవితం పట్ల ఎలాంటి కంప్లయింట్స్ లేవు..
బ్రిటిష్ పౌరసత్వంతో లండన్లో స్థిరపడాలనేది మొహిసిన్ ఖాన్ నిర్ణయం. అది రీనాకు నచ్చకపోయినా భర్త కోసం సరేననుకుంది. షూటింగ్స్ ఉన్నప్పుడు ముంబై రావడం.. అయిపోగానే లండన్ వెళ్లిపోవడం ఆమె షెడ్యూల్‌లో భాగమయ్యాయి. ఈలోపు ఆ జంటకు బిడ్డ పుట్టింది. పాపను పెంచడం కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంది రీనా.
మొహిసిన్ నటించాలన్న ఆశతో బాలీవుడ్ స్క్రీన్ మీద హీరోగా లాంచ్ అయ్యాడు. కానీ సినీ ప్రేక్షకులు అతణ్ణి పెద్దగా ఆదరించలేదు. దాంతో ఆ కుటుంబం లండన్, ముం బైల రాకపోకలు ఆగిపోయి లండన్లోనే ఉండడం మొదలైంది. అది రీనాకు చాలా కష్టమైపోయింది. పైగా మొహిసిన్ విలాసవంతమైన జీవితం అర్థిక ఇబ్బందులను కొనితెచ్చిపెట్టింది. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి.
ఆ బంధం చూస్తుండగానే వీగిపోయింది. కూతురు కస్టడీ కోర్టు కేసుల ద్వారా మొహిసిన్‌కే దక్కింది. రీనా తర్వాత మళ్లీ వివాహం చేసుకున్న మొహిసిన్ దాంట్లోను ఇమడలేక పోయాడు చివరకు కూతురు సనమ్‌ను రీనాకే అప్పటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ముంబైలో యాక్టింగ్ స్కూల్ నడుపుతున్న రీనాను కదిలిస్తే జీవితం పట్ల ఎలాంటి కంప్లుంట్స్ లేవంటుంది రీనా రాయ్.