30 August, 2026 | 7:43 PM

భగవద్గీత శ్లోక పఠన పోటీలకు విశేష స్పందన

30-08-2026 06:33 PM

ముకరంపుర, ఆగస్టు 30(విజయ క్రాంతి): అతి పురాతనమైన సంస్కృత భాషను దేవ భాషాగా భావిస్తారని తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాస్యం సేనాధిపతి అన్నారు. ఆదివారం తెలుగు భాషా సంరక్షణ సంఘం, శాతవాహన లయన్స్‌ క్లబ్, లీడ్‌ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్త నిర్వహణలో చేపట్టిన “భగవద్గీత శ్లోక పఠన పోటీలు” కార్యక్రమానికి విశేష స్పందన లభించడం సంతోషదాయకం అన్నారు. 

ఈ కార్యక్రమంలో నిర్వహకులు తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ లయన్‌ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని భాషలకు మూలంగా నిలుస్తున్న సంస్కృతాన్ని మదర్‌ ఆఫ్‌ ఆల్‌ లాంగ్వేజెస్‌ అని పిలవడం సముచితంగా ఉందని అన్నారు. మన పిల్లలకు భాషపై పట్టు, ఉచ్చారణ, సాంస్కృతిక వారసత్వం, వేద ఇతిహాసాల పరిచయం చిన్నతనం నుంచే అలవాటు చేయాలన్నారు.

భగవద్గీత శ్లోకాలను నేర్పే గురువు శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి ఆదివారం శ్లోక ధారణ శిక్షణ తరగతులని నిర్వహిస్తున్నామని, ఆసక్తి కలిగిన వారు కోదండ రామాలయంలో  తమను సంప్రదించాలని సూచించారు.  ఈ పోటీల్లో పాల్గొని శ్లోకాలు పఠించిన పిల్లలకు అందరికీ ప్రశంసా పత్రాలు,  బహుమతులు అతిథుల చేతుల మీదుగా అందజేశారు.