04-05-2025 12:11:49 AM
కొంచెం తీపి.. కొంచెం పులుపు కలిస్తే చిరుతిళ్లు.. భలే రుచిగా ఉంటాయి. ఈ ఎవర్ గ్రీన్ కాంబినేషన్‌లో చేసుకునేవే మోమోలు. వీటి రుచి అద్భుతం. ఎన్నెన్నో రుచుల్ని దాచుకున్న రుచి భాండాగారాలు అనొచ్చు వీటిని. ఎందుకంటే పైనుంచి చూస్తే ఒక పొరను కప్పుకుని సాదాసీదాగా కనిపించినా లోపల మాత్రం రుచులు కూరుకుని ఉంటాయి.
వీటిని తిన్నాక మనసు దోచుకున్నావే మోమో అనకతప్పదు. అలాంటి స్టఫ్డ్ శ్నాక్ ఐటమ్ లిస్ట్‌లో మోమోలకి ఈ మధ్య క్రేజ్ బాగా పెరిగింది. మరి మోమోల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి? వాటిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
తందూరి మోమో
ఇట్ల చేద్దాం..
మైదా, నూనె ఒక గిన్నెలో వేసి గోరు వెచ్చని నీళ్లు పోస్తూ ముద్ద చేసి పక్కన పెట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి తరుగు వేగించాలి. అందులో క్యారెట్, క్యాబేజీ, పుట్టగొడుగులు, పనీర్ తరుగు వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు, సోయాసాస్, ఉల్లికాడల తరుగు వేసి కలపాలి. చిన్నగిన్నెలో కార్న్‌ఫ్లోర్ వేసి అందులో నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా పాన్‌లో పోసి కలపాలి.
ఒక గిన్నెలో ఆవనూనె, కారం, నిమ్మరసం, పెరుగు, కస్తూరీ మేతీ, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. రెడీ చేసుకున్న పిండి ముద్దను ఉండలు చేసి, చపాతీల్లా వత్తాలి. వాటి మధ్యలో స్టఫింగ్ పెట్టి మోమోల్లా చుట్టాలి. పాన్‌లో వేగించడానికి సరిపడా నూనె వేడి చేయాలి. వేడి అయిన నూనెలో మోమోలను వేగించాలి. వేగించిన మోమోలను తందూరీ మిశ్రమంలో కలపాలి. వాటిని గ్రిల్ పాన్ మీద కాల్చాలి.
వెజ్ మోమో
ఇట్ల చేద్దాం..
ఒక గిన్నెలో మైదా, ఉప్పు వేసి అందులో నీళ్లు పోసి ముద్దలా కలపాలి. ఉండలు చేసి గిన్నెపై మూతపెట్టి పావుగంట పక్కన ఉంచాలి. కాటన్ క్లాత్‌లో క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ తరుగు వేసి నీళ్లన్నీ పిండేయాలి. వాటిని ఒక గిన్నెలో వేసి, అందులో ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి, అల్లం తరుగు, సోయాసాస్ వేసి బాగా కలపాలి.
రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని చపాతీల్లా వత్తి, వాటి మధ్యలో స్టఫింగ్ పెట్టి మోమోల్లా తయారుచేయాలి. పాన్‌లో నీళ్లు పోసి అందులో చిల్లులు గిన్నెని ఉంచాలి. దానికి నూనె పూసి మోమోలను అందులో పెట్టి, మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. వీటిని ఎలక్ట్రిక్‌కుక్కర్‌లో కూడా వండుకోవచ్చు.
చికెన్ 65
ఇట్ల చేద్దాం..
ఒక గిన్నెలో చికెన్ ఖీమా, కారం, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, సోయాసాస్, క్యాబేజీ, క్యారెట్లు, ఉల్లికాడల తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో మైదా, నూనె వేసి వేడి నీళ్లు పోస్తూ పిండిని కలపాలి. ముద్దగా చేశాక చిన్న ఉండలు చేయాలి. వాటిని చపాతీల్లా వత్తి రెడీ చేసిన స్టఫింగ్ అందులో పెట్టాలి. మోమోల ఆకారంలో చేశాక.. వాటిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మోమోలు ఉంచిన ప్లేట్స్ పెట్టాలి. పైన మూత పెట్టి ఉడికించాలి.
ఫ్రైడ్ చికెన్
ఇట్ల చేద్దాం..
ఒక గిన్నెలో మైదా, ఉప్పు, నూనె వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోస్తూ ముద్దలా కలిపి అరగంట పక్కన పెట్టాలి. మరో గిన్నెలో చికెన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లికాడల తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, ఉప్పు వేసి వేడి నూనె పోయాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలుపుకున్న పిండి ముద్దను చిన్న ఉండల్లాగా చేసి చపాతీల్లా వత్తాలి. తర్వాత అందులో ఖీమా మిశ్రమం పెట్టి మోమో షేపులో చుట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో రెడీ చేసిన మోమోలను వేయాలి. బంగారు రంగు వచ్చేవరకు వాటిని వేగించాలి.
సాబుదానాతో..
ఇట్ల చేద్దాం..
సగ్గుబియ్యాన్ని సన్నటి మంట మీద నూనె లేకుండా వేగించాలి. అవి చల్లారాక మిక్సీ జార్‌లో వేసి పిండి పట్టాలి. ఆ పిండిని జల్లెడ పట్టి అందులో కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి గరిటెతో కలపాలి. ఆ తర్వాత వేడి నీళ్లు పోసి పిండిని ముద్దలా కలపాలి. నూనె వేసి చేసి అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. క్యాబేజీ తరుగు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్‌ల తరుగు, ఉప్పు వేయాలి.
ఇవి కాసేపు వేగాక వెనిగర్, మిరియాల పొడి, ఉల్లికాడల తరుగు వేసి కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను ఉండలు చేసి, చిన్న చపాతీల్లా వత్తాలి. అందులో స్టఫింగ్ పెట్టి మూసేయాలి. ఆ మోమోలను ఆవిరి మీద ఉడికించాలి.