‘ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తా’
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ పతక విజేత, భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యమని పేర్కొంది. 75 కేజీల విభాగానికి మారిన తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని తెలిపింది. ఒలిం పిక్స్‌లో రెండో పతకం సాధించడమే తన టార్గెట్ అని అభిప్రాయపడింది. ‘ 75 కేజీల విభాగానికి మారిన తర్వాత నా ప్రదర్శన బాగుందనిపిస్తుంది.
ఈ కేటగిరిలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలుచుకోవడం పెద్ద విజయం అని చెప్పొచ్చు. నా బరువుపై కూడా పూర్తి నియంత్రణతో ఉన్నా. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానన్న నమ్మకం ఉంది ’ అని వెల్లడించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా బొర్గొహైన్ 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఒలింపిక్స్‌కు 69 కేజీల కేటగిరిని తొలగించారు. దీంతో 75 కేజీల కేటగిరిలో లవ్లీనా పోటీపడనుంది.






