గుకేశ్ విజయ గర్జన
క్యాండిడేట్స్ చెస్ టైటిల్ కైవసం
n పిన్న వయస్కుడిగా రికార్డు
n వరల్డ్ చాంపియన్‌షిప్‌నకు అర్హత
ప్రపంచ వేదికపై భారత మువ్వన్నెల జెండా మరోసారి రెపరెపలాడింది. చదరంగంలో మరో కొత్త కెరటం అంతర్జాతీయ స్థాయిలో తళుక్కున మెరిసింది. ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ సంచలనం గుకేశ్ అదరగొట్టాడు. 64 గళ్ల క్రీడలో మనకు తిరుగులేదని నిరూపిస్తూ.. పట్టుమని 17 ఏళ్లు నిండకముందే ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించాడు.
టొరంటో, ఏప్రిల్ 22: తన విజయంతో ప్రపంచ వేదికపై భారత ఖ్యాతి పులకించిపోయేలా చేశాడు భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్. కెనడాలోని టొరంటో వేదికగా ఆదివారం జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే టోర్నీలో విజేతగా నిలిచి అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఆదివారం అమెరికాకు చెందిన హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకున్న గుకేశ్ టైటిల్ విజేతగా నిలిచాడు. 13వ రౌండ్ ముగిసేసరికి 8.5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచిన గుకేశ్.. హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు.
హోరాహోరీగా సాగిన గేమ్‌లో ఇద్దరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంతో ఆఖరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో గుకేశ్ ఖాతాలో 9 పాయింట్లు చేరాయి. మరోవైపు నెపోమ్నియాషి (రష్యా) ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. వారిద్దరు 8.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ టైటిల్‌ను అందుకున్నాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత కాండిడేట్స్ చెస్ టైటిల్ ను సాధించిన రెండో భారతీయుడిగా గుకేశ్ చరిత్రకెక్కాడు. ఇక మహిళల విభాగంలో 14 రౌండ్లు ముగిసేసరికి భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రెండో స్థానంలో నిలిచింది.
టోర్నీలో విజేతగా నిలవడం సంతోషంగా అనిపిస్తోంది. నకమురతో మ్యాచ్ డ్రా చేసుకున్న తర్వాత నా దృష్టి
నెపోమ్నియాచి, కారువానా మ్యాచ్‌పై నెలకొంది. ఆ గేమ్ కూడా డ్రా కావడం.. నేను విజేతగా నిలవడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యా. వరల్డ్ చాంపియన్‌గా నిలవడమే తదుపరి లక్ష్యం. నా గురువు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత టైటిల్ సాధించిన రెండో వ్యక్తిగా నిలవడం నాకు గొప్ప విషయం. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడు గౌరవంగా భావిస్తాను. ఇక చిన్నప్పటి నుంచి క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని అంటే చాలా ఇష్టం. ఇద్దరి దారులు వేరైనప్పటికి అతనే నాకు స్పూర్తి. ఇప్పుడు మాత్రం టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను నా ఫెవరెట్ ఆటగాడిగా చెప్పుకుంటా’
గుకేశ్
అత్యంత చిన్న వయస్కుడిగా క్యాండిడేట్స్ చెస్ టోర్నీని నెగ్గిన గుకేశ్‌కు అభినందనలు. నీ విజయాన్ని చూసి వాకా చెస్ ఫ్యామిలీ గర్వపడుతోంది. నువ్వు ఆడుతున్న తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఆడి విజేతగా నిలవడం అభినందనీయం. విజయాన్ని ఆస్వాదించు.
విశ్వనాథన్ ఆనంద్






