డబుల్ బొనాంజా
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్‌లు జరుగుతున్నకొద్దీ ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. బెంగళూరు, ముంబైలను మినహాయిస్తే ప్లేఆఫ్స్‌లో నాలుగు స్థానాలకు మిగతా అన్ని జట్లు పోటీలోనే ఉన్నాయి. దీంతో ఏ జట్ట్లు అర్హత సాధిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌లు అభిమానులకు మరింత కిక్ ఇవ్వనున్నాయి. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ అమితుమీ తేల్చుకోనుండగా.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు తలపడనున్నాయి. ఇం కేంటి రెండు మ్యాచ్‌లతో డబుల్ బొనాంజా ఆస్వాదించేందుకు సిద్ధమైపోండీ..!
లక్నో x కోల్‌కతా
లక్నో: ఐపీఎల్ 17వ సీజన్‌లో డబుల్ హెడర్‌లో భాగంగా ఆదివారం రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. సొంతగడ్డపై జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కావాలని లక్నో అనుకుంటోంది. మరోవైపు గత మ్యాచ్‌లో ముంబైని వారి సొంతగడ్డపై మట్టికరిపించి జోష్‌లో ఉన్న కోల్‌కతా ఈసారి లక్నో పని పట్టాలని చూస్తోంది. 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో కోల్‌కతా పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. లక్నో ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో సమానంగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య సూపర్ ఫైట్ జరగడం ఖాయమే. కోల్‌కతా బ్యాటింగ్ విషయానికి వస్తే నరైన్, సాల్ట్‌లు జట్టుకు మంచి ఆరంభాలను ఇస్తున్నారు. అనంతరం వస్తున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ రాణిస్తున్నారు. ఇక ఫినిషర్లుగా రింకూ సింగ్, రసెల్‌లు అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా పేసర్ వైభవ్ అరోరాతో పాటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిలకడగా రాణిస్తూ వికెట్లు పడగొడుతున్నారు. లక్నో బ్యాటింగ్‌కు కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్‌లు పెద్ద బలం. వీరితో పాటు డికాక్, కొత్తగా వచ్చిన అర్షిన్ కులకర్ణితో పాటు బదోనీలు ఆకట్టుకుంటున్నారు. ఇక నికోలస్ పూరన్ ఫినిషర్‌గా వస్తూ జట్టుకు విలువైన పరుగులు జోడిస్తున్నాడు. బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ దూరమవ్వ డం లక్నోకు ఎదురుదెబ్బ. రవి బిష్ణోయి, నవీన్ ఉల్ హక్, మోసిన్ ఖాన్‌లు పర్వాలేదనిపిస్తున్నారు.
చెన్నై x పంజాబ్
ధర్మశాల: రెండు వరుస విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలను స్థిరంగా ఉంచుకున్న పంజాబ్ కింగ్స్ సొంతగడ్డపై మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం ధర్మశాల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ తలపడనుంది. గత మ్యాచ్‌లో చెన్నై జట్టును వారి సొంతగడ్డపై మట్టికరిపించిన పంజాబ్ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తోంది. మరోవైపు పంజాబ్ చేతిలో తమకు ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని చెన్నై చూస్తోంది. పంజాబ్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఇక చెన్నై 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరువ కావాలంటే ఇరుజట్లకు విజయం తప్పనిసరి. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ మరో రెండు మ్యాచ్‌లకు దూరం కావడంతో సామ్ కరన్ మరోసారి జట్టును నడిపించనున్నుడు. బెయిర్ స్టో, రిలీ రొసౌ, ప్రబ్‌సిమ్రన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలతో పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలో రబడ, అర్ష్‌దీప్, హర్షల్ పటేల్ మెరుస్తున్నారు. స్పిన్ విభాగంలో రాహుల్ చహర్, హర్‌ప్రీత్‌లు ఆకట్టుకుంటున్నారు. ఇక చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ రుతురాజ్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తోడు హార్డ్ హిట్టర్ శివమ్ దూబే, డారిల్ మిషెల్‌లు రాణిస్తున్నారు. ఇక ధోనీ ఆఖర్లో వచ్చి ఫినిషర్‌గా అదరగొడుతున్నాడు. ముస్తఫిజుర్, పతిరణ, దీపక్ చహర్, జడేజాలతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.






