రాజ్యాధికారం కోసం మాదిగలు సంఘటితం కావాలి
ఎమ్మెస్‌ఎఫ్ జాతీయ నేత మంద కుమార్ మాదిగ
హనుమకొండ టౌన్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బలమైన శక్తిగా ఎదగడానికి సంఘటితం కావాల్సిన అవసరం ఉందని ఎమ్మెస్‌ఎఫ్ జాతీయ నేత మంద కుమార్ మాదిగ తెలిపారు.
శుక్రవారం హనుమకొండ బాల సముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెస్సీ జాతీయ నేత మంద కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బుర్ర బిక్షపతి మాదిగ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణ నివేదికలో మాదిగల జనాభా 10.43 శాతంగా తేలిందని,
దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 10 నుండి 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిగలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి తగిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ భూములను మాదిగలకు పంచాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగలు శాసనమండలిలో, లోకసభలో, రాజ్యసభలో నామినేట్ పోస్టులలో ఒక్కరు కూడా లేరని, ఈ అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి ఉత్సవ కమిటీలో మందకృష్ణ మాదిగను సభ్యుడిగా చోటు కల్పించినందుకు, ప్రధాని నరేంద్ర మోడీకి యావత్తు మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరన్న కాపు, గద్దల సుకుమార్ మాదిగ, బండారి సురేందర్ మాదిగ, పుట్ట రవి మాదిగ, మందరాజు మాదిగ, జన్ను దినేష్ మాదిగ, ఏకు శంకర్ మాదిగ, జిల్లెల్ల మురళి మాదిగ, అంకెనకుంట వెంకటస్వామి, రాజారావు బిక్షపతి మాదిగ పాల్గొన్నారు.






