14 August, 2026 | 2:30 AM

మీరు చేయకపోతే మేం చేస్తాం!

14-08-2026 01:18 AM
  1. ఫుడ్ ఐటమ్స్‌పై హెచ్చరిక లేబుల్స్ వేయాల్సిందే..
  2. కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం.. రెండు వారాల గడువు
  3. కార్పొరేట్ సంస్థలకు తలొగ్గుతున్నారని వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఆగస్టు 13: అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు కలిగిన ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుళ్లను ‘మీరు చేయలేకపోతే.. మేం చేస్తాం’ అని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీచేసింది. అధికారులు ఏమైనా కార్పొ రేట్ సంస్థల ఒత్తిడికి లొంగిపోతున్నారా? అని నిలదీసింది. ఈ విషయంలో కేంద్రం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.

చర్యలు తీసుకోకుంటే.. తామే రంగంలోకి దిగుతామని హెచ్చరిస్తూ.. కేం ద్రానికి సర్వోన్నత న్యాయస్థానం అల్టిమేటం ఇచ్చింది. తుది నిర్ణయం తెలుపడానికి కేం ద్రానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ప్యా క్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబు ళ్ల అంశం పౌరులు ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యానికి సంబంధించింది. దీనిపై తీసుకునే నిర్ణయాలు కార్పొరేట్ ఒత్తిళ్లకు ప్రభావితం కాకూడదు అని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.

ఆహార పదార్థాల లేబులింగ్ విషయంలో దాఖలైన ప్రజా ప్ర యోజన వ్యాజ్యంపై (పిల్) విచారణ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. ఆహారరంగ పరిశ్రమ ఈ లేబుళ్లను వ్యతిరేకిస్తోందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చేసిన వాదన లను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మార్చి 7న జరిగిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సమావేశం మినిట్స్‌ను పిటిషనర్ తరఫు లాయర్ ప్రస్తావిస్తూ.. అందులో తీసుకున్న నిర్ణయాలు కోర్టు గతంలో ఇచ్చిన ఆదే శాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ప్యాకెట్లపై హెచ్చరిక లేబుళ్లను ఆహార పరిశ్రమ వ్యతిరేకిస్తోందని పేర్కొంటూ.. దానికి బదులుగా రోజువారీకి అవసరమైన చక్కెర, సంతృప్త కొవ్వులు, ఉప్పు పరిమాణా న్ని తెలియజేసే పట్టిక రూపంలో ఇవ్వాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించింది. అయితే, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన అఫిడవిట్లో కేవలం ఆహార పరిశ్రమ వ్యతిరేకతను మాత్రమే పేర్కొందని, చక్కెర, ఉప్పు, కొవ్వులు ఎక్కువ ఉన్న ఆహారాల వినియోగాన్ని తగ్గించడానికి హెచ్చ రిక లేబుళ్లు ఎంత అవసరమో పౌర సమాజం ప్రతినిధులు సమర్పించిన ఆధారాలను పూర్తిగా విస్మరించిందని కోర్టు దృష్టి కి తీసుకెళ్లారు.

చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా లేదా?

ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేదా? అని కేంద్రం తరఫు న హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ బ్రిజేందర్ చాహర్‌ను ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు, తమ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని పునరుద్ఘాటించింది. బడా కార్పొరేట్ సంస్థల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని, దానికి ‘తలొగ్గుతోందని’ వ్యాఖ్యానించింది.

కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలుచేయ డం లేదని, ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని నిలదీసింది. ‘ప్రభుత్వమే స్వయంగా ఈ పని చేస్తుందా, లేక మేమే ఉత్తర్వులు జారీచేయాలా?’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

కేంద్రం వాదనను తోసిపుచ్చిన కోర్టు..

సాంప్రదాయ భారతీయ పిండివంటలు/స్నాక్స్ (ఉదాహరణకు నమకీన్ వంటివి)పై ఎరుపు రంగు హెచ్చరిక మార్కులు పడతాయని, విదేశీ ప్రమాణాలను ఇక్కడ నేరుగా అమలుచేయడం కష్టమని కేంద్రం తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనను తిరస్కరిం చిన కోర్టు ‘భారతదేశం ఇం కా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోవాలా?’ అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తుది నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది. లేనిపక్షంలో తదుపరి విచారణలో కోర్టు నేరుగా ఉత్తర్వులు జారీ చేస్తుందని స్పష్టంచేసింది.

అసలు విషయం తెలియాలి..

ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించడానికి అనుమతించాలని అదనపు సొలిసిటర్ జనరల్ కోరగా.. తమ ఆదేశాలను ప్రభుత్వం అమలుచేసి తీరాల్సిందేనని తేల్చిచెప్పింది. ‘తయారీదారులకు ఇది నచ్చకపోవచ్చు, కానీ వినియోగదారునికి అసలు విషయం తెలియాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హెచ్చరిక లేబుల్ ముఖ్య ఉద్దేశం విక్రయాలను నిలిపివేయడం కాదని, తాము ఏమి తింటున్నారో వినియోగదారులకు తెలియజేయడమేనని స్పష్టం చేసింది. హెచ్చరిక బోర్డు ఉన్నప్పటికీ ఆ ఉత్పత్తిని కొనాలా? వద్దా? అనే తుది నిర్ణయం వినియోగదారుడిదే అవుతుంది అని పేర్కొంది.