పార్టీతో సంబంధంలేనివారికి కీలక పదవులు!
- వ్యతిరేకతతోనే తనను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నం
- ఏపూరి సోమన్న పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కొంతమంది ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండటం బాధాకరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానని చెప్పారు. రవీంద్రభారతిలో కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై రూపొందించిన పుస్తకాన్ని రాజగోపాల్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా గళం విప్పింది తానేనన్నారు. అందుకే అప్పటి సీఎం కేసీఆర్ తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. మునుగోడులో నన్ను ఓడించేందుకు 100 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించారని గుర్తుచేశారు.
ఏపూరి సోమన్న లాంటి కళాకారులకు అండగా ఉంటానని, తాను గెలిపించిన ఓ ఎమ్మెల్యే కులం కార్డు అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయాలను మార్చే శక్తి తనకుందని, నిజాయతీ కలిగిన వారు నా వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో రాజకీయ మార్పు తీసుకురాగలమని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.






