స్మార్ట్ రేషన్ కార్డులొస్తున్నాయ్
- రేపటి నుంచి పంపిణీ
- హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్‌తో రూపకల్పన
- మోడల్ కార్డును విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు మరింత ఆధునిక, పారదర్శక సేవలు అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15 (రేపటి) నుంచి వరుసగా 15 రోజులపాటు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనుంది. ఈ నేపథ్యంలో కార్డుకు సంబంధించిన నమూనాను గురువారం ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.
ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రూపొందించిన ఈ కార్డుల్లో భద్రత, స్పష్టతకు ప్రాధాన్యం కల్పించారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో ముఖ్యమైన వివరాలను పొందుపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫొటోలతో పాటు రేషన్‌కార్డు నంబర్, కుటుంబ యజమాని పేరు, సంబంధిత రేషన్ షాపు నంబర్ వంటి వివరాలను ముద్రించారు.
దీంతో లబ్ధిదారుడి కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కార్డుపైనే స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశారు. కార్డు వెనుక భాగంలో ప్రత్యేక హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. కార్డు దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు అసలైన కార్డును సులభంగా గుర్తించే విధంగా హోలోగ్రామ్ ఉపయోగపడనుంది.
అదేవిధంగా అవసరమైన సమాచారాన్ని తక్షణమే పొందేందుకు క్యూఆర్ కోడ్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సాంకేతికత ఆధారంగా సేవలను వేగవంతం చేయడంలో ఈ క్యూఆర్ కోడ్ కీలకంగా ఉండనుంది.
రేషన్ సేవలు సులభం
లబ్ధిదారుడికి సంబంధించిన చిరునామా వివరాలను సైతం కార్డులో పొందుపరిచారు. గ్రామం, ప్రాంతం, మండలం, జిల్లా తదితర వివరాలతో పాటు పూర్తి చిరునామాను నమోదు చేశారు. దీంతో లబ్ధిదారుడి వివరాలను స్పష్టంగా గుర్తించేందుకు వీలు కలగనుంది.
కార్డులోని వివరాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటంతో రేషన్ సేవలను పొందడంలో లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతోపాటు లబ్ధిదారుల వివరాల నిర్వహణ మరింత సులభతరం కానుందని ప్రభుత్వం పేర్కొంటోంది.






