కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా
- కృష్ణా జలాల వివాదాలపై 17న సమావేశం
- జలసౌధలో ఉదయం 11 గంటలకు నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): కృష్ణా జలాల వివాదాలపై చర్చించేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సభ్యుల అభ్యర్థన మేరకు ఈ నెల 13న జరగాల్సిన సమావేశాన్ని ఈ నెల 17కు రీషెడ్యూల్ చేసినట్టు కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ కుమార్ కంబోజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
17న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి ఛాంబర్‌లో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సమావేశానికి ఇరు రాష్ట్రాల ఇంజినీర్ -ఇన్ చీఫ్(ఈఎన్సీ)లు హాజరుకావాలని కేఆర్‌ఎంబీ కోరింది. కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కేటాయింపులు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో త్రిసభ్య కమిటీ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
రెండు రాష్ట్రాల నీటి వనరుల శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై తమ రాష్ట్రాల వాదనలు, అభ్యంతరాలను కమిటీ ముందు ఉంచే అవకాశం ఉన్నది. ఆగస్టు 7న జారీ చేసిన సమావేశ నోటీసుకు కొనసాగింపుగా తాజాగా రీషెడ్యూల్ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.






