9 June, 2026 | 1:27 AM

నిత్యం ప్రజాసేవలో ఉన్న నాయకులు మాగంటి గోపీనాథ్

09-06-2026 12:00 AM

మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి

జూబ్లీహిల్స్, జూన్ 8 (విజయక్రాంతి): తాను జీవించినంత కాలం నిత్యం ప్రజాసేవలో ఉన్న నాయకులు మాగంటి గోపీనాథ్ అని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం మాగంటి గోపీనాథ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా విజయం సాధించిన ఘనత గోపీనాథ్ కు దక్కుతుందన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడి ఇంటికి చేర్చారని గుర్తు చేసుకున్నారు. అందుకే నేటికి కూడా ప్రజలు ఆయన్ను తమ గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి వారికి అన్నీ తానై ఉన్నారన్నారు. అటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగానే తీరని లోటు అన్నారు. మాగంటి గోపీనాథ్ స్ఫూర్తితో ప్రతి బీఆర్‌ఎస్ నాయకుడు, కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని డివిజనుల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.