26 February, 2026 | 3:47 AM

మణిగిళ్ల సర్కారు బడికి మహర్దశ

26-02-2026 12:02 AM
  1. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సర్పంచ్ భరోసా 

సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ 

పెద్దమందడి ఫిబ్రవరి 25 ప్రభుత్వ పాఠశాలలు కేవలం భవనాలు మాత్రమే కాదు, అవి గ్రామాల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన దేవాలయాలని మణిగిళ్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సుమారు లక్షలాది రూపాయల అంచనాతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శ్రీకారం చుట్టారు.గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలంటే వారికి సరైన వేదిక అవసరమని గుర్తించిన సర్పంచ్, పాఠశాల ఆవరణలో ఒక సువిశాలమైన స్టేజీ (అసెంబ్లీ స్టేజి ) నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ స్టేజీ అందుబాటులోకి వస్తే.. జాతీయ పండుగలు, వార్షికోత్సవాలు మరియు సాంస్కృతిక పోటీల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.చాలా మంది బాలికలు పాఠశాలల్లో సరైన పారిశుధ్య వసతులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన సర్పంచ్, ప్రాధాన్యత క్రమంలో బాలికల కోసం అత్యాధునిక మరుగుదొడ్ల, టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బడికి వచ్చే ప్రతి విద్యార్థిని సురక్షితమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలన్నదే మా లక్ష్యం‘ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోతుల రామిరెడ్డి, గొంది ప్రతాపరెడ్డి స్థానిక నాయకులు రామ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బికే నాయుడు మరియు పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. తమ పిల్లల కోసం ఇంతటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సర్పంచ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.