ఆధ్యాత్మిక రహస్యాల మహేంద్రగిరి వారాహి
సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. దీన్ని మహేంద్రగిరి నేపథ్యంలో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇందులో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రతాప్ ఆర్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా, జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా, కృష్ణ ఆర్ట్స్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
వారాహి మాత ఆధ్యాత్మిక శక్తి చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి స్పందనను దక్కించుకుంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా తాజాగా మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో చిత్రబృందం వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఈ కార్యక్రమంలో హీరో సుమంత్ మాట్లాడుతూ.. “వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక గొప్ప అనుభూతి.
మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. అందరూ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా” అని చెప్పారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. “రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నాం. ప్రేక్షకుల ఆశీర్వాదాలతో సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. ‘ఎంతో నమ్మకంతో మంచి సినిమా తీశాం’ అని నిర్మాత కలిపు మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు సురేశ్, వంశీ చాగంటి, మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.






