18 July, 2026 | 1:37 AM

సీసీఐ పునర్ ప్రారంభానికి ప్రభుత్వాలు చొరవ చూపాలి

18-07-2026 01:37 AM

సీసీఐ సాధన కమిటీ డిమాండ్ 

ఆదిలాబాద్, జూలై 17 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ పునర్ ప్రారంభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్ర వారం సీసీఐ సాధన కమిటీ సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 15న బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు కేటిఆర్, జోగు రామన్నల నేతృత్వంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులం ఢిల్లీలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, సీసీఐ సీఎండీ సంజయ్ బంగాలతో సమావేశమవ్వగా పరిశ్రమ పునర్ ప్రారంభానికి కట్టుబడి ఉన్నామని, సీసీఐ భూములను ఇతర ఏ శాఖకు బదలాయింపు చేసేది లేదని స్పష్టం చేశారన్నారు.

పరిశ్రమ ప్రారంభానికి రెండు వేల కోట్లు అవసరం అవుతుందని, అందుకోసం కేంద్రం రూ. 250 కోట్లు, రాష్ట్రం రూ. 250 కోట్లు సహకరిస్తే సీసీఐ సంస్థ రూ. 1500 కోట్లు లోను తీసుకుంటుందని తెలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అనుమతులు, రాయితీలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినా ఇప్పటి వరకు స్పందించలేదని సీఎండీ, కేంద్ర మంత్రి తెలిపారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

వేల కోట్లతో వివిధ రకాల ప్రాజెక్టులు చేపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 500 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదని, వెంటనే నిధులను మంజూరు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ, ఎంపిలు కాలు అడ్డం వేయకుండా పరిశ్రమ పునర్ ప్రారంభానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కో కన్వీనర్లు విజ్జగిరి నారాయణ, కొండా రమేష్, వెంకట్ నారాయణ, జగన్ సింగ్, నాయకులు లోకరీ పోశెట్టి, బండి దత్తాత్రి, ఈశ్వర్ దాస్, అరుణ్ కుమార్, చిల్క దేవిదాస్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.