ఆగస్టు నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సర్వీసులు

07-05-2024 01:51:16 AM

న్యూఢిల్లీ, మే 6: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులను ప్రారంభించ నుంది. ‘ఆత్మనిర్భార్’ పాలసీకి అనుగుణంగా పూర్తిగా దేశీయ టెక్నాలజీతో 4జీ సర్వీసులను అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పైలెట్ ప్రాతిపదికన 700 మెగాహెర్జ్, 2,100 మెగాహెర్జ్ బ్యాండ్స్‌లో నడుస్తున్న 4జీ నెట్‌వర్క్‌లో సెకనుకు 40 మెగాబైట్స్ స్పీడ్‌ను సాధించామని వారు వెల్లడించారు. టీసీఎస్, ప్రభుత్వ రంగ టెలికం రీసెర్చ్ సంస్థ సీడాట్ నేతృత్వంలోని కన్సార్షియం అభివృద్ధిపర్చిన దేశీయ టెక్నాలజీతో బీఎస్‌ఎన్‌ఎల్ పంజాబ్‌లో 4జీ సర్వీసుల్ని పైలెట్ ఫేజ్‌గా అమలు చేసింది. 8 లక్షల మంది చందాదారుల్ని సంపాదించింది. సీడాట్ అభివృద్ధి చేసిన 4జీ కోర్ పంజాబ్‌లోని తమ నెట్‌వర్క్‌లో బాగా పనిచేస్తున్నదని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు వివరించారు. 

రూ.19,000 కోట్ల ఆర్డర్లు

4జీ నెట్‌వర్క్ కోసం, తదుపరి దానికి 5జీకి అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర టెలికం పరికరాల కోసం టీసీఎస్, తేజాస్ నెట్‌వర్స్, ప్రభుత్వ రంగ ఐటీఐలు బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి రూ. 19,000 కోట్ల విలువైన ఆర్డర్లు పొందాయి.  4జీ, 5జీ సర్వీసుల్ని అందించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లు ఏర్పాటుచేసే పనిలో బీఎస్‌ఎన్‌ఎల్ నిమగ్నమై ఉన్నది. ఇప్పటివరకూ 9,000కుపైగా టవర్లు ఏర్పాటు చేశామని, వాటిలో 6,000 వరకూ ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా సర్కిల్‌లో నెలకొల్పినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారి ఒకరు తెలిపారు. గత నాలుగైదేండ్లుగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ కేపబుల్ సిమ్‌లను విక్రయిస్తున్నదని, పాత సిమ్‌లు కలిగిన వారు మాత్రమే ఈ సర్వీసుల కోసం కొత్తవి తీసుకోవాల్సి ఉంటుంద ని ఆ అధికారి వివరించారు.