8 ఎకరాల్లో మొక్కజొన్న దగ్ధం
- కోత కోసం పంటచేల్లో కుప్పలు వేసిన రైతులు
- నర్సాపూర్ జీ మండలం తెంబుర్నిలో ఘటన
నిర్మల్, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలం తెంబుర్ని గ్రామంలో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైనట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన రైతులు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భార్గవ్ అనే రైతులకు చెందిన మొక్కజొన్న కోత కోసి పంటచేల్లో కుప్పలు వేసి ఆరబెట్టారు. గురువారం రాత్రి ఒక్కసారిగా మొక్కజొన్న పంటకు నిప్పు అంటుకోవడంతో 8 ఎకరాల్లో పూర్తిగా కాలిపోయింది.
అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకునేలోపే తమ పంట దగ్ధమైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లక్షల పంట దగ్ధం కాగా పెట్టుబడి సైతం నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియలేదు. రైతులకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా ఆ పంట పొలాల పక్కన ఉన్న మరో రైతు ప్రశాంత్ పసుపు పంట నిప్పు ఆనడంతో అది రంగు మారిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.




