29 April, 2026 | 1:33 PM

అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.!

27-04-2026 03:02 PM

- మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

- మంత్రి జూపల్లి కృష్ణారావు

- లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం

కొల్లాపూర్ రూరల్:  అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న పంటను తరలించేందుకు లారీల కొరత ఉందని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై వెంటనే స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, మొక్కజొన్న కొనుగోలు చేసిన వెంటనే రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లారీల కొరత లేకుండా చూడాలని, రైతులు కేంద్రాలకు తీసుకువచ్చిన పంటను వెంటనే తూకం వేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు తమ పంటను నిర్ణీత తేమ శాతం, నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

పెద్దకొత్తపల్లిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో పరిసర గ్రామాల రైతులకు రవాణా ఖర్చులు తగ్గి, సమయం ఆదా అవుతుందని అన్నారు. దళారుల బెడద లేకుండా రైతులకు మెరుగైన మద్దతు ధర లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, పీఏసీఎస్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.