తెలంగాణలో కొత్త పార్టీకి ఏం పని— సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- కేసీఆర్ చావు నేను ఎందుకు కోరుకుంటా
- కవిత పార్టీపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
- అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చిట్ చాట్
- బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది.. భవిష్యత్ లేదు
- కేసీఆర్ చనిపోతే నాకేం వస్తుంది.
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కొత్త పార్టీకి ఏం పని అన్న రేవంత్ రెడ్డి ఉన్న పార్టీ ఉంటుందా.. పోతుందా అని చమత్కరించారు. కేసీఆర్ పార్టీకి మనుగడ లేదని రేవంత్ ఎద్దేవా చేశారు. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ఒకటే అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది.. భవిష్యత్ లేదని తెలిపారు.
ఉద్యమం అప్పుడు ఎలా మాట్లాడినా సహించారు. అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారు. కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తెచ్చి పెట్టుకున్న నటన చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబమంతా ఒక్కటే.. రంగు, రుచి లేదన్నారు. కుటుంబ పెద్ద తర్వాత వారసత్వం వస్తుందని తెలిపిన రేవంత్ కేసీఆర్ చనిపోతే తనకేం వస్తుందని పేర్కొన్నారు. ''కేసీఆర్ చావు నేను ఎందుకు కోరుకుంటా.. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే మాకు మంచిది, కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి. కేసీఆర్ మరమనిషో.. కాదో కుటుంబసభ్యులకే తెలుసు. వివక్ష లేని పాలన మాది.. మాకు ప్రతి పక్షమే లేదు'' అని సీఎం స్పష్టం చేశారు.






