14 May, 2026 | 4:03 AM

మొక్కజొన్న కొనుగోలు వేగవంతంగా చేపట్టాలి

14-05-2026 02:55 AM

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): మొక్కజొన్న కొనుగోలులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ వాన్ కోరారు. బుధవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ఉత్తునూరు గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రైతులు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించాలని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, నీడ, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

రైతులు తీసుకొచ్చిన మొక్కజొన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించి, తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చూడాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు, తూర్పార పట్టడం,రవాణా ప్రక్రియలు సమన్వయంతో కొనసాగించాలని ఆదేశించారు. సహకార అధికారి రామ్మోహన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.