10 July, 2026 | 11:54 AM

రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

01-12-2024 03:20 AM

వారణాసి, నవంబర్ 30: ఉత్తరప్రదేశలోని వారణాసి రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్కింగ్ ప్రదేశంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దాదాపు 200 వాహనాలు, బైక్‌లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసలు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దాదాపు  200 బైక్‌లు కాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. దగ్ధమైన వాహనాలన్నీ రైల్వే ఉద్యోగులకు చెందినవేనని అధికారులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేసు నమోదు చేసుకునిపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.