calender_icon.png 2 February, 2026 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేషన్ పీఠంపై ప్రధాన పార్టీల కన్ను

02-02-2026 01:14:04 AM

60 డివిజన్లో 806 నామినేషన్లు 

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలపై హై ఓల్టేజ్ 

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): రాష్ట్రమంతా ఒకదారి... కొత్తగూడెం నియోజకవర్గం మరో దారి అన్నట్లుగా ఉంది రాజకీయ పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తొలిసారి జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హై వోల్టేజ్ నెలకొంది. పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ ప్రాంతాలలో మొత్తం 60 డివిజన్లలో పెద్ద సంఖ్యలో ఆశావాహులు నామినేషన్లను దాఖలు చేశారు. రికార్డు స్థాయిలో 806 మంది అభ్యర్థులు నామినేషన్ లను దాఖలు చేశారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నామినేషన్లను పరిశీలించారు.

సయోధ్య కోసం అధికార కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన అగ్ర నేతలు రహస్య ప్రదేశాల్లో పలుమార్లు చర్చలు నిర్వహించిన ఫలితం దక్కలేదు. దీంతో పొత్తు వీడి... కత్తులు దూసుకొనే పరిస్థితి నెలకొంది. సిపిఎంతో అవగాహన కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంతో వడంబడిక కుదుర్చుకొని సిపిఐ పార్టీలు బరిలో దిగనున్నాయి. నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సానుకూలంగా మార్చుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్టు సమాచారం.

పరిస్థితిని చూస్తే మేయర్ స్థానాన్ని దక్కించుకోనేందుకు ప్రధాన పార్టీలు  ఎత్తులు, జిత్తులకు పాల్పడుతున్నారు. పరిస్థితి సిపిఐ, కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదరనట్లే తెలుస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు మేయర్ స్థానం దక్కించుకునేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బలహీనతను పసిగట్టిన సిపిఐ ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునీ ఎక్కువ సంఖ్యలో డివిజన్లో దక్కించుకోవాలని చూస్తోంది. అదే క్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం కొత్తగూడెంలో మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గెలుపు గుర్రాలపై కాంగ్రెస్ నేతలు సర్వేలు నిర్వహించి బీఫామ్ కేటాయించేలా ప్రయత్నాలు చేపట్టారు.

అధికార పార్టీకి  ఒక్కొక్క డివిజన్ నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావాహులు టిక్కెట్లు ఆశిస్తూ నామినేషన్లు సమర్పించారు. అధికార పార్టీ నుంచి బీఫామ్ రానిపక్షంలో మరో పార్టీ నుంచి బి ఫాం పొందేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఎవరు ఏ పార్టీ నుంచి, ఏ గుర్తుపై పోటీ చేస్తారనేది అభ్యర్థుల్లో గంధర గోళం నెలకొంది. మరోవైపు టిఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకులు బద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెంలో మకం వేసి అత్యధికంగా కార్పొరేషన్ సీట్లు గెలిచేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా ఆ పార్టీల నుంచి ఇన్చార్జిలుగా నియమితులైన వారిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమైంది.

కార్పొరేషన్ ఎన్నికలను అనుకూలంగా మలుచుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర పోటీ చేస్తారనే ప్రచారం సైతం నియోజకవర్గంలో విస్తృతంగా వినిపిస్తోంది. కార్పొరేషన్ గెలుపు తమ భవిష్యత్తుకు సోపానాలుగా వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హై వోల్టేజ్ గా మారిందని చెప్పవచ్చు. ఎవరికివారు అసంతృప్తి నేతలపై కన్నేసి కండువాలు కప్పి బలాన్ని పెంచుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.