02-02-2026 01:24:43 AM
తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం
వెల్లడించిన మంత్రి జూపల్లి
గాంధీ ఆసుపత్రిలో మృతదేహానికి నివాళి
స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
నిజామాబాద్/సికింద్రాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): జనవరి 23న గంజాయి ముఠా కారుతో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య(24) శనివారం మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య మృతదేహానికి మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు.
సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, సౌమ్య సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకు వేతనం చెల్లిస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్ను వణికించేలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం తమ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి రెండు నిముషాల మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు. కాగా ఎక్సైజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
మోస్రాలో అంత్యక్రియలు
హైదరాబాద్ నుంచి సౌమ్య మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆమె స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.