26 June, 2026 | 2:27 AM

ప్రైవేటు కాలేజీలకు భారీ ఊరట

26-06-2026 01:21 AM
  1. ఫీజు రీయింబర్స్‌మెంట్.. జీవో-9పై హైకోర్టు స్టే
  2. కేంద్ర విధానాల వల్లే భారం పడుతుందన్న రాష్ట్రం
  3. విచారణ జూన్ 30కి వాయిదా

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9లోని కొన్ని నిబంధనలపై జూన్ 30వరకు హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు. కేంద్ర విధానాల వల్లే భారం పడుతుందని రాష్ట్రం తెలిపింది.

సకాలంలో చెల్లిస్తే పిటిషన్లు వెనక్కి తీసుకుంటామని కాలేజీ యాజమాన్యాల తెలిపాయి. అయితే విద్యార్థులు నలిగిపోకుండా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు సూచించారు. గురువారం పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వంపై ధర్మాసనం మరోమారు పలు ప్రశ్నలను సంధించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎందుకు విడుదల చేయలేదని, బకాయిలు చెల్లించకుండా కళాశాలలను ఎలా నడుపుతారని, ప్రస్తుత విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని? రీయింబర్స్‌మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారని, ఎప్పటిలోగా చెల్లిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఆగస్ట్ 15లోపు బకాయిలను చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. అదే సమయంలో రీయింబర్స్‌మెంట్ పథకంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నిధుల్లో కేంద్రం వాటా ఉంటుందని, ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులు చెల్లించాలని, ఆ తరువాత కేంద్రం విడుదల చేస్తుందని చెబుతోందన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై బకాయిల భారం పడుతుండడం వల్లే కొంతమేర ఆలస్యం జరుగుతోందని కోర్టుకు వివరించారు.

కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి రెండు వారాల సమయం కావాలన్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే, బకాయిలు సకాలంలో చెల్లిస్తే పిటిషన్లను వెనక్కు తీసుకుంటామని ప్రైవేటు కళాశాలల తరఫున వాదిస్తున్న న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

వారి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అటు ప్రభుత్వం, ఇటు కళాశాలల యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని అన్నారు. అలా జరగకుండా చూడాలని కోర్టును కోరారు. ముగ్గురి పక్షాల వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణను జూన్ 30కి వాయిదా వేసింది.