15 May, 2026 | 12:42 AM

ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపు

15-05-2026 12:00 AM
  1. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు నోటీసులు
  2. జూలై 31న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు
  3. కేసుతో సంబంధం ఉన్న అధికారులకు సమన్లు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాలను గత కొన్ని నెలలు గా కుదిపేస్తున్న ఫార్ములా ఈ కేసు ఇప్పుడు మరింత కీలక దశకు చేరుకుంది. జూలై 31న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఈ కేసులో ఏ1 గా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది.

అదే సమయంలో అప్పటి ప్రభుత్వ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్‌ఎస్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యం లో, ఈ కేసు ఇప్పుడు కేవలం పరిపాలనా అం శంగా కాకుండా రాజకీయ సమరంగా మారిపోయింది.

ఫార్ములా ఈ-రేస్ ప్రాజెక్ట్ మొదట ప్రకటించినప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీన్ని తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం ద్వారా నగరాన్ని అంతర్జాతీయ మ్యాప్‌పై మరింత బలంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రారంభించింది.

హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేక ట్రాక్ నిర్మాణం, రోడ్ల ఆధునీకరణ, లైటింగ్, అర్బన్ డిజైన్ పనులు వేగంగా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే విదేశీ సంస్థలకు జరిగిన సుమారు రూ.55 కోట్లు అక్రమంగా చెల్లించారంటూ.. ఆరోపణలు వచ్చాయి. ఈ చెల్లింపులు ప్రభుత్వంలోని తగిన ఆర్థిక, న్యాయ, పరిపాలనా అనుమతులు పూర్తిగా లేకుండానే జరిగాయని ఏసీబీ అధికారులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందే కేటీఆర్‌ను అనేకసార్లు విచారించారించారు.