తెలంగాణకు 20, ఏపీకి 10 టీఎంసీలు
- శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తాగునీటి కేటాయింపులు
- నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేసిన కేఈఆర్‌ఎంబీ
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాలకు తాగునీటి విడుదలపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎం బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన ఇండెంట్లను పరిశీలిం చిన కమిటీ, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకుంది.
నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ సర్కార్.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి 18 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం కోరింది. 18 టీఎంసీల్లో హైదరాబాద్ నగరంతో పాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సాగర్ నుంచి 13 టీఎంసీలు, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు శ్రీశైలం నుంచి 5 టీఎం సీలను తెలంగాణ సర్కార్ కోరింది.
ఈ సమయంలో ఏపీకి అదనపు నీటి విడుదల జరిగితే తెలంగాణలో తాగునీటి సంక్షోభం, కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కూడా అధికారులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మే 12న నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ అధికారులు నాగార్జున సాగర్ నుంచి 16 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు జూలై వరకు అవసరమని కోరగా, ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆగస్టు 15 వరకు 10 టీఎంసీల నీరు కావాలని స్పష్టం చేశారు.
సుదీర్ఘ చర్చల అనంతరం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న అందుబాటులోని నీటిని తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని కమిటీ నిర్ణయించింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీలు, తెలంగాణకు నాగార్జునసాగర్ నుంచి 15.941 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 4.908 టీఎంసీల నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు ఆగస్టు 15, 2026 వరకు అమల్లో ఉండనున్నాయి. అదే సమయంలో శ్రీశైలం జలాశయ నీటిమట్టం 810 అడుగుల కంటే, నాగార్జునసాగర్ నీటిమట్టం 510 అడుగుల కంటే తగ్గకుండా చూసుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు కమిటీ పేర్కొంది. తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ కనిష్ట నీటిమట్టాలను కొనసాగించడం అత్యవసరమని అభిప్రాయపడింది.
ఉత్తర్వుల్లో షరతులు
కేఆర్‌ఎంబీ ఉత్తర్వుల్లో కొన్ని కీలక షరతులను కూడా పేర్కొంది. విడుదల చేస్తున్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని, శ్రీశైలం నుంచి తెలంగాణకు కేటా యించిన నీటిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. దీనిపై ఏపీ జెన్కో అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు నీటి వినియోగం, సరఫరాపై సంయుక్త నివేదికను క్రమం తప్పకుండా కేఆర్‌ఎంబీకి సమ ర్పించాల్సి ఉంటుంది.
నీటి విడుదల పూర్తిగా అత్యవసర తాగునీటి అవసరాలకే వినియోగించబడేలా చర్యలు తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు ఆగస్టు 15కు ముందుగా జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగితే, అదనపు నీటి విడుదల కోసం ఇరు రాష్ట్రాలు తిరిగి త్రిసభ్య కమిటీని ఆశ్రయించవచ్చని కేఆర్‌ఎంబీ తెలిపింది. ఈ ఉత్తర్వులు రెండు రాష్ట్రాల సాధారణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేయాలని సభ్య కార్యదర్శి సతీష్‌కుమార్ కాంబోజ్ పేర్కొన్నారు.






