24 April, 2026 | 3:06 AM

టెండర్లు పిలిచే ఏర్పాట్లు చేయండి

24-04-2026 01:42 AM
  1. ‘డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్
  2. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిత్యం యాక్సిడెం ట్స్ జరిగే ఎల్బీ నగర్-హయత్‌నగర్ ప్రాంతంలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సంకల్పించిందని, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లోని 54 కాలనీల్లో నివసించే సుమారు 20లక్షల మంది ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ దారిలో రాకపోకలు సాగించే లక్షల మంది 15 నిమిషాల్లోపే సిటీ క్రాస్ చేస్తారని అన్నారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు నిర్మించతలపెట్టిన 7.1 కి.మీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పురోగతిపై గురువారం సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సుమారు రూ. 941 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్ట్‌లో రాష్ట్ర వాటాగా రూ. 200 కోట్లు ఇచ్చేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. నాగపూర్ తర్వాత ఇండియాలో చేపట్టే రెండో పెద్ద ప్రాజెక్ట్ అన్నారు. దీనికి వీలైనంత త్వరగా సాంక్షన్స్ చేసుకొని, టెండర్ ప్రక్రియ పూర్తి చేసేలా కృషి చేయాలని మంత్రి ఎంవోఆర్‌టీహెచ్ అధికారులకు సూచించారు.

డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ఎంవోఆర్‌టీహెచ్ వార్షిక ప్రణాళికలో ఇప్పటికే పొందుపర్చామని అధికారి కృష్ణ ప్రసాద్ తెలిపారు. కింద సర్వీస్ రోడ్డు, మధ్యలో జాతీయ రహదారి, పైన మెట్రో రైలు నిర్మాణం నేపథ్యంలో సాంకేతికంగా పిల్లర్ ఫౌండేషన్, స్ట్రక్చర్స్, మెట్రో స్టేషన్స్ వంటి అంశాలపై చర్చించారు. 

ఈ నేపథ్యంలో ఒకే వర్క్ ఏజెన్సీ నిర్మాణ పనులు చేపడితే సమన్వయలోపం లాంటి ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా ఉంటుందనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు మానిటరింగ్ చేయడానికి వీలుగా ఉంటుందనీ,పనులు కూడా సమాంతరంగా జరుగుతాయని మంత్రితో అధికారులు తమ అభిప్రాయాలను చెప్పారు.

మంత్రి సూచన మేరకు అందుకు అనుగుణంగా హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్ ప్రాజెక్ట్ కన్సెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. కన్సల్టెన్సీని పిలిచి డీటెయిల్ ఎస్టిమేట్స్ తయారు చేయాలని నిర్ణయించారు. అధికారులు తమ స్థాయిలో ఉన్న పనులు త్వరగా పూర్తి చేస్తే వచ్చే వారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వెంటనే ప్రారంభించేలా విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.