చేయూత పింఛను దరఖాస్తులు సద్వినియోగం చేసుకోవాలి
మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న
తుంగతుర్తి, (విజయక్రాంతి): రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించారు. ర్హుల నుంచి దరఖాస్తులను నిరంతరం స్వీకరించనున్నట్లు.. ఇందుకు ఎలాంటి చివరి తేదీ లేదని స్పష్టం చేశారు. కొత్త పింఛన్ల మంజూరులో కొన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి ప్రాధాన్యంగా ఒంటరి మహిళలు, వితంతువులను పరిగణించనున్నారు
అలాగే గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు. దివ్యాంగుల కేటగిరీలో థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులను కూడా అర్హులుగా పరిగణించి పింఛన్లు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేయూత పింఛన్లకు అర్హత విషయంలో కుటుంబ వార్షికాదాయానికి పరిమితిని ప్రభుత్వం ని గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.1.50 లక్షల కంటే తక్కువగా ఉన్నవారు అర్హులు. పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2 లక్షల కంటే తక్కువగా ఉండాలి. నిర్ణయించిన ఆదాయ పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారిని పింఛన్‌కు అనర్హులుగా పరిగణిస్తారు. వ్యవసాయ భూమి విషయంలోనూ పరిమితులను విధించారు
మూడెకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్నవారు పింఛన్‌కు అర్హులు కారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అనర్హులుగా పేర్కొన్నారు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు కూడా ఈ పింఛన్లకు అర్హులు కారు.అదేవిధంగా ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్‌ల యజమానులు, వారి తల్లిదండ్రులను కూడా అనర్హుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే ప్రభుత్వం, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్నవారికి కొత్తగా చేయూత పింఛన్ మంజూరు చేయరు. నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాలు కలిగి ఉన్నవారినీ అనర్హులుగా పరిగణించనున్నారు.
గతంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తమ దరఖాస్తులు ప్రస్తుతం రికార్డుల్లో ఉన్నాయో లేదో సంబంధిత అధికారుల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు ఈ వివరాలను ధ్రువీకరించనున్నారు. ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డి పేద ప్రజల ప్రయోజనాలు దృష్ట్యా చేయూత పథకాన్ని ప్రవేశపెట్టడం మనందరి అదృష్టం అనే ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






