8 August, 2026 | 5:00 PM

రామప్ప నుండి గ్రావిటీ ద్వారా గణపురం చెరువుకు నీటిని తరలించాలి

08-08-2026 03:25 PM

రైతుల పట్ల ప్రభుత్వ పనితీరు సరిగా లేదు 

చాతకాని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులు నడ్డివిరుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు

విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి, ఆగస్టు 08 (విజయక్రాంతి): రామప్ప నుండి గ్రావిటీ ద్వారా గణపురం చెరువుకు నీటిని తరలించి రైతులను ఆదుకోవాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆశించిన స్థాయిలో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయని,ప్రభుత్వం తక్షణమే స్పందించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తాగు,సాగునీటి అవసరాల కోసమే దేవాదుల ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు.

నిబంధనల ప్రకారం నెలకు 6 టి.ఎం.సి ల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా,9 పంపులు నడవాల్సిన చోట 6 లేదా 7 మాత్రమే నడుపుతున్నారని విమర్శించారు. పదవులు పొందిన పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులకు నీళ్లు అందడం లేదన్నారు.​రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గణపురం చెరువుకు నీటిని తీసుకురావడానికి మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 18 కోట్లు వెచ్చించి నిర్ణయం తీసుకున్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను పక్కనపడేసిందని నీటిని తెచ్చే మార్గం ఉన్నా, పంటలను ఎండబెట్టడం బాధాకరమని అన్నారు.వెంటనే గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.​రైతులకు నీరు అందించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం సరికాదని ఎద్దేవా చేశారు. 

ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వమే రైతుల పొట్ట కొడుతోందని,రైతుల పక్షాన బిఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా ​అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని గండ్ర కోరారు. వచ్చే ఆగస్టు 15 నాటికి పెంచిన పింఛన్లను లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు కటకం జనార్దన్, నాయకులు మేకల సంపత్,  గణపురం మండల నాయకులు పొలుసాని లక్ష్మి నరసింహారావు, గాజుల చింటూ గౌడ్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం, యూత్ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.