30-07-2024 01:49:01 AM
సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేల వినతి
హైదరాబాద్, జూలై 29( విజయక్రాంతి): మంత్రి వర్గంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన చాంబర్‌లో.. సోమవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మందు సామేలు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు కలిశారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో.. నూతన కేబినేట్‌లో మాదిగ సామాజికవర్గానికి అవకాశం కల్పించాలిన కోరారు.
రాష్ట్రంలో 50 లక్షల వరకు మాదిగలు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కూడా మాదిగల పాత్ర కీలకమని వివరించారు. మూడు పార్లమెంట్ సీట్లు ఎస్సీ రిజర్వుడు ఉన్నప్పటికీ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని.. అయినప్పటికీ మాదిగలు కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకు సరైన ప్రాతినిధ్యం లేదని విమర్శలు వస్తున్నాయని.. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.