31 March, 2026 | 1:14 AM

మలబార్ గోల్డ్ రూ.200 కోట్ల సీఎస్ఆర్ కార్యక్రమాలు విడుదల

30-03-2026 11:24 PM

న్యూఢిల్లీ, 30 మార్చి 2026:

ప్రపంచంలో ఐదవ అతిపెద్ద రిటైల్ ఆభరణాల గ్రూప్, ఆభరణాల బ్రాండ్ అయిన మలబార్ గోల్డ్ & డైమండ్స్, న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తమ రూ. 200 కోట్ల విలువైన సీఎస్ఆర్ కార్యక్రమాలను  వెల్లడించింది.

ఈ సీఎస్ఆర్  కార్యక్రమంలో, భారతదేశవ్యాప్తంగా 33,000 మంది విద్యార్థినిలకు విద్యా స్కాలర్‌షిప్‌ల పంపిణీని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం.పి. అహ్మద్, మేనేజింగ్ డైరెక్టర్ - ఇండియా ఆపరేషన్స్ ఓ. ఆషర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు  నిషాద్ ఎ.కె.  మరియు అబ్దుల్లా ఇబ్రహీం, కేరళ హౌస్ రెసిడెంట్ కమిషనర్ పునీత్ కుమార్, ఐఏఎస్, ప్రథమ్ సీఈఓ రుక్మిణి బానర్జీ,  థానల్ చైర్మన్ డాక్టర్ ఇద్రిస్ తదితరులు హాజరయ్యారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ 'బేటీ బచావో, బేటీ పఢావో' వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశపు ఆడబిడ్డలకు సాధికారత కల్పించాలన్న   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా, మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనే మాట్లాడుతూ సీఎస్ఆర్ కోసం రూ. 200 కోట్లు కేటాయించాలన్న మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిర్ణయం దేశ ప్రగతిని మరింత బలోపేతం చేస్తుందన్నారు.  భారతదేశ వృద్ధి ప్రజల, ముఖ్యంగా మహిళలు మరియు బాలికల సాధికారతలో మిళితమై ఉందని ఆయన నొక్కిచెప్పారు;  విద్య ద్వారా అర్థవంతమైన మార్పును తీసుకురావడంలో మలబార్ సంస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. విద్యార్థులు, యువత పెద్ద కలలు కనాలని, పరిమితులను అధిగమించి ఉన్నత ఆశయాలను ఏర్పరుచుకోవాలని, భారతదేశం అందిస్తున్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ప్రోత్సహించారు.

దేశ వృద్ధి గాథకు చురుకుగా తోడ్పాటునందించాలని ఆయన కోరారు.  జాతీయ వృద్ధికి వెన్నెముకగా మానవ వనరుల అభివృద్ధి నిలుస్తుందని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ చెప్పారు. నాణ్యమైన విద్య ద్వారా ప్రతిభను పెంపొందించడం అత్యవసరం. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం విద్యార్థులకు విద్యాపరంగా విజయం సాధించి, దేశాభివృద్ధికి తోడ్పడేలా చేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. గణనీయమైన రీతిలో సీఎస్ఆర్ పెట్టుబడుల ద్వారా స్థిరమైన, దీర్ఘకాలిక సామాజిక ప్రభావాన్ని సృష్టించడానికి మా గ్రూప్ కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.