అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
చేగుంట, జూలై 1 : ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చలేక భారంగా మారి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఎర్రగోళ్ల ఎల్లం( 36 ) తన ఇంటి నిర్మాణానికి 8 లక్షల రూపాయలు అప్పులు చేశాడు. అప్పులను ఎలా తీర్చాలో తెలియక తన పొలం వద్ద పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే, కుటుంబ సభ్యులు నార్సింగిలోని చారి ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుని భార్య ఎర్రగోళ్ల రేణుక ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్‌ఐ 2 బిక్యా నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
చికిత్స పొందుతూ బాలిక మృతి...
తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతున్నారని తీవ్ర మనస్థాపానికి గురై బాలిక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మాసాయిపేట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మాసాయిపేట గ్రామానికి చెందిన దొంతి నర్సింలు దంపతులు తరచూ గొడవ పడుతుండేవారని, వీరి తగాదాల వల్ల మనస్థాపానికి గురైన వారి కుమార్తె దొంతి అక్షయ(15) గతనెల 12న పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబీకులు నిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్ తెలిపారు. తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్ తో రైతు మృతి...
వ్యవసాయ పొలంలో విద్యుత్ బోరుకు మరమ్మతు చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై రైతు మృతి చెందిన సంఘటన నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. నార్సింగికి చెందిన వంజరి నర్సింలు(45) అనే కౌలు రైతు వ్యవసాయం పొలం వద్ద బోరుకి విద్యుత్ రావడం లేదని మరమ్మత్తులు చేస్తుండగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.






