6 May, 2026 | 2:37 AM

అడ్మిషన్లు తెస్తేనే కొలువు..!

06-05-2026 01:17 AM

ప్రైవేటు టీచర్లకు యాజమాన్యాల ఆదేశం

ఒక్కొక్కరు ఐదు అడ్మిషన్లు మస్ట్

లేకుంటే జీతం పెంపు ఉండదు

సంగారెడ్డి, మే 5 (విజయక్రాంతి): వేసవి సెలవులంటే స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ టీచర్లకు పండగే. కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. స్కూల్ ప్రారంభం నుంచి విద్యార్థులకు మంచి మార్కులు, ర్యాంకులు తెప్పించేందుకు నానాతంటాలు పడిన ప్రైవేట్ టీచర్లకు యాజమాన్యాలు కొత్త టార్గెట్లు ఫిక్స్ చేశాయి.

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మీషన్ల బాధ్యత ఇప్పటి నుంచే టీచర్లకు అప్పగించారు. కొన్ని విద్యా సంస్థలైతే కావాల్సిన అడ్మిషన్లు తీసుకురాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కరాఖండీగా చెబుతున్నట్లు తెలిసింది. దీంతో ప్రైవేటు టీచర్లు మండుటెండల్లో కరపత్రాలను పట్టుకొని వీధుల వెంట, విద్యార్థుల ఇంటింటికి అడ్మిషన్ల కోసం తంటాలు పడుతున్నారు.

ఏడాదిలో 10 నెలల జీతమే..

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో సుమా రు 5వేలకు పైగా ఉపాధ్యాయులు పని చేస్తుంటే, వీరిలో 70 శాతం మహిళలే ఉన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. తక్కువ వేతనాలకే అధిక పని గంటలతో పాటు సమయానికి జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయనే విమర్శలున్నాయి. తల్లిదండ్రుల వద్ద 12 నెలల ఫీజులు వసూలు చేసి, ఉపాధ్యాయులకు కేవలం 10 నెలల జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ లాంటి సౌకర్యాలేమీ కల్పించడం లేదనే విమర్శలున్నాయి.

రంగంలోకి విద్యార్థి సంఘాలు..

ఒక్కో ప్రైవేటు టీచర్కు 5 నుంచి 10 అడ్మిషన్లను యాజమాన్యాలు టార్గెట్ విధిస్తున్నాయని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. టార్గెట్ పూర్తి చేయని టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. కార్పొరేట్ వ్యాపారంగా బోధన రంగం మారుతుందని, టీచర్లపై టార్గెట్ విధించే వారిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాం డ్ చేస్తున్నారు.

‘కార్పొరేట్’లో దక్కని అవకాశాలు..

జిల్లాలో మొత్తం 201 ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు లక్షకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. పట్టణా ల్లో కార్పొరేట్ స్కూల్స్ సంఖ్య ప్రతి విద్యా సంవత్సరం పెరుగుతోంది. అయితే ఇందు లో పనిచేసేవారు ఎక్కువగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వస్తున్నారు. ప్రిన్సిపాల్ తో పాటు వివిధ ఉన్నత స్థాయి పోస్టులను వా ళ్ళకే ఇస్తున్నారని, కొన్ని పోస్టులు మాత్రమే స్థానికులకు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులు చివరకు ప్రైవే టు స్కూళ్లలో టీచింగ్ చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో కూడా స్థానికులకే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ తెర పైకి వస్తోంది.